టీడీపీకి జై కొట్టిన బీజేపీ ఓటర్లు..!
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పార్టీల మధ్య విచిత్ర మైన పరిస్థితులు ఉంటాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ఎవరితో సఖ్యతగా ఉంటాయో అంతు చిక్కదు. అదే సమయంలో మిగిలిన విపక్షాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ప్లేట్లు ఫిరాయిస్తూ ఉంటాయి. గత ఎన్నికల వరకూ టీడీపీ – బీజేపీ కలిసి పనిచేశాయి. ఆ తర్వాత దూరమయ్యాయి. ఇప్పుడు వైసీపీ – బీజేపీ సఖ్యతగా ఉంటున్నాయి. టీడీపీ కూడా బీజేపీతో కలిసి పని చేయాలని బలంగా కోరుకుంటోంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఇందుకు సుముఖంగా లేదు.
కానీ బీజేపీ ఓటర్లు మాత్రం టీడీపీతో కలిసి పని చేయాలని బలంగా కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతానికి వైసీపీ – బీజేపీ అన్యోన్యంగా ఉంటున్నాయి. వైసీపీ అడిగిన అన్నింటినీ కేంద్రంలోని బీజేపీ అధిష్టానం సానుకూలంగా పరిష్కరిస్తోంది. అలాగే బీజేపీతో కూడా వైసీపీ అధినేత జగన్ సామరస్యంగా ఉంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ఎలాంటి అవసరం వచ్చినా కాదనకుండా బేషరుతుగా మద్దతు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ అడగకుండానే అన్నీ ఇస్తున్నప్పుడు ఇక మిగిలిన పార్టీల అవసరం ఏముంటుంది? అందుకే టీడీపీని దూరం పెడుతోంది బీజేపీ.
కానీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు టీడీపీకి రెండో ప్రాధాన్యత ఓట్లు వేసిన దాన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసి పని చేయాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో 73.6శాతం బీజేపీ ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓట్లను టీడీపీకి వేశారు. అలాగే తూర్పు రాయలసీమలో 65.5శాతం, పశ్చిమ రాయలసీమలో 72.8 శాతం బీజేపీ ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును టీడీపీకే వేశారు. దీన్ని బట్టి బీజేపీ అనుకూల ఓటర్లు మూడొంతుల మంది టీడీపీతో కలిసి వెళ్లాలని కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది.
బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా ఇదే ఆశిస్తోంది. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసిపోటీ చేస్తే ఏపీలో వైసీపీని ఈజీగా ఓడించవచ్చనేది పవన్ కల్యాణ్ ఆలోచన. అయితే పవన్ సూచనలను బీజేపీ పట్టించుకోకపోవడంతో ఆయన బీజేపీకి దూరమయ్యారు. టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీజేపీ ఒంటరైంది. మరి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ అవలంబిస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













