జగన్ సర్కార్ విజ్ఞప్తిని మన్నించిన సుప్రీంకోర్టు..! రాజధాని కేసు తేలబోతోందా…?
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై పీటముడి ఏర్పడిన సంగతి తెలిసిందే! గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దీనికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో అనేక అక్రమాలు జరిగాయని, పైగా ఒకే రాజధాని వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని చెప్పుకొచ్చింది. అందుకే పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు, పలు పార్టీలు, ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ దూకుడుకు బ్రేక్ పడింది. ఇప్పుడీ అంశం కోర్టులో ఉంది.
అమరావతి రాజధానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అసెంబ్లీలో బిల్లు కూడా పాసైంది. శాసన మండలి మాత్రం దీన్ని తిప్పిపంపింది. అదే సమయంలో రాజధానిపై జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు .. అమరావతినే రాజధానిగా అభిపృద్ధి చేయాలని ఏపీ సర్కార్ ను ఆదేశించింది. దీంతో మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అమరావతే ఇప్పుడు రాజధానిగా కొనసాగుతోంది.
మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడంతో అమరావతే రాజధాని అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. దీన్ని విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది. అంటే దాదాపు రెండు నెలలకు పైగా సమయం తీసుకుంది. కానీ రాజధాని అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఈనెల 9కి వాయిదాను ప్రీపోన్ చేసింది.
ఏపీ సర్కార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను ముందుకు జరపడంతో త్వరలోనే రాజధాని అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావిస్తున్నారు. రాజధాని అంశం తేలితే విశాఖపట్నానికి మకాం మార్చాలని సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఇక్కడికి మకాం మార్చబోతున్నట్టు ఇటీవల విశాఖపట్నంలో జగన్ వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు పరిధిలో కేసు ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగదని జగన్ భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా దీన్ని తేల్చాలని కోరారు. సెప్టెంబర్ నాటికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేస్తుందని వైసీపీ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ లో మకాం మార్చుతానని జగన్ ప్రకటించారు.













