అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..! ఏపీలో మిశ్రమ స్పందన..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి సుమారు ఎనిమిదిన్నరేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకూ రాజధానిపై మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ప్రకటించింది. ప్రధానితో ఘనంగా శంకుస్థాపన కూడా చేయించింది. అయితే వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు విశాఖ, కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లడంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. అయితే అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అటు ప్రభుత్వం కూడా అప్పీల్ చేయడంతో ఈ వ్యవహారంలో అత్యున్నత ధర్మాసనం ముందు నిలబడింది. రాజధాని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.
అమరావతి కేసులో హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాని హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన కాలపరిమితపై మాత్రం సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పాల్సిందిగా ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతిపై కేసును జస్టిస్ కె.ఎం.జోసెఫ్, బి.వి.నాగరత్న ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా.. ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఆదేశాలిస్తారా.. అని ప్రశ్నించింది. కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కావని.. ఇలాంటి ఆదేశాలివ్వడం సరికాదని అభిప్రాయపడింది. కోర్టులే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకని ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వం లాగా వ్యవహరిస్తోందా.. అని న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అంతా ఒకేచోట కేంద్రీకరించాలనడం ఎలా అని అడిగారు. ఏ ఏ నగరాలను అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదా.. అని ప్రశ్నించారు. ఈ అంశంలో హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని 3 నుంచి 7 ఆదేశాలపై స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నేతలు ఈ అంశంలో తాము విజయం సాధించామని చెప్తున్నారు. ఆరు నెలల్లోపు అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మాసనం తప్పుబట్టడంతో వైసీపీ నేతలు ఆనందంగా ఉన్నారు. హైకోర్టు పరిధిని అతిక్రమించిందని సుప్రీంకోర్టు ధర్మానం అభిప్రాయపడిందని.. ఇది కచ్చితంగా తమ విజయమని చెప్తున్నారు. అదే సమయంలో .. అమరావతి కేసులో హైకోర్టు నిర్ణయంపై పూర్తిగా స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో ప్రతిపక్షాలు, అమరావతి రైతులు ఆనందంతో ఉన్నారు. ఇది కచ్చితంగా తమ విజయమేనని అభిప్రాపయడుతున్నారు. వేల ఎకరాలను రాజధానికోసం ఇచ్చామని.. కచ్చితంగా న్యాయం తమవైపే నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలే లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.













