Somu Veerraju: సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ..! టీడీపీ కేడర్ ఫైర్..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు (AP MLC Elections) జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదింటినీ కూటమి పార్టీలో గెలుచుకుంటాయి. నిన్నటి వరకూ టీడీపీ (TDP), జనసేన (Janasena) మాత్రమే పోటీ చేస్తాయని భావించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ (BJP) కూడా తమకో సీటు కావాలని అడగడంతో చంద్రబాబు అంగీకరించక తప్పలేదు. దీంతో సోము వీర్రాజును (Somu Veerraju) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అనగానే టీడీపీ శ్రేణులు (TDP Cadre) ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోము వీర్రాజు కోసమే సీటు త్యాగం చేసింది అని ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ హైకమాండ్ (TDP High Command) నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
సోము వీర్రాజు కరుడుగట్టిన బీజేపీ నేత. ఆ పార్టీకోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. ఏ పార్టీ నేత అయినా ఇలా చేయడంలో తప్పులేదు. అయితే సోము వీర్రాజుపై వైసీపీ (YCP) అనుకూలడనే ముద్ర ఉంది. అందుకే టీడీపీ శ్రేణులు సోము వీర్రాజు పేరెత్తగానే ఆవేశంతో ఊగిపోతున్నారు. ఏపీలో గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. అప్పుడు కూడా సోము వీర్రాజు అధికార పక్షాన్ని వదిలేసి చంద్రబాబును (Chandrababu), టీడీపీనీ టార్గెట్ చేసేవారు. చంద్రబాబుపై కొన్ని సందర్భాల్లో పరుష పదజాలం కూడా ఉపయోగించారు. పైగా వైసీపీ తరపున లోపాయకారీగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
శాసన మండలిలో (Legislative Council) ఇప్పటికీ వైసీపీదే ఆధిపత్యం. ఆ పార్టీ ఎమ్మెల్సీలు పలువురు రాజీనామా చేసినా మండలి ఛైర్మన్ వాటిని ఆమోదించకుండా అలాగే తొక్కిపెడుతూ వస్తున్నారు. ఇలాంటప్పుడు మండలిలో వైసీపీని ఎదుర్కొనేందుకు బలమైన వాయిస్ వినిపించగలిగే వాళ్లయితే బాగుంటుందని టీడీపీ భావించింది. అందులో భాగంగానే గ్రీష్మ (Kavali Greeshma), నాగబాబు (Nagababu) తదితరులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. అయితే బీజేపీ మాత్రం సోము వీర్రాజును నామినేట్ చేయడంతో టీడీపీ కేడర్ ఒక్కసారిగా ఖంగుతింది. వైసీపీపై మండలిలో సోము వీర్రాజు పోరడగలరా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సోము వీర్రాజుకు చివరి నిమిషంలో సీటు దక్కడం వెనుక మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి (Chiranjeevi), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సిఫారసు చేయడం వల్లే సోము వీర్రాజును టీడీపీ పరిగణనలోకి తీసుకుందని చెప్పుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో సోము వీర్రాజుకు టీకెట్ దక్కకపోవడం, అధ్యక్ష పదవి నుంచి తప్పించడం.. లాంటి పరిణామాలతో ఆయనలో మార్పు కనిపిస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ (Nara Lokesh), చంద్రబాబుతో సోము వీర్రాజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. దీంతో ఆయన మారారని భావించి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.













