కోవర్టులను సోము వీర్రాజు సాగనంపుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది నేతలు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి కాదు కదా.. కనీసం ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కించుకునే సత్తా లేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల తమ స్వప్రయోజనాల కోసం చాలా మంది నేతలు బీజేపీలో చేరి కాలం గడుపుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి నేతలందరూ ఒక్కక్కరిగా తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. దీంతో వారిని పార్టీ నుంచి సాగనంపేందుకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సిద్ధమవుతున్నారు.
2019లో ఏపీలో టీడీపీ ఓడిపోయాక చాలా మంది నేతలు బీజేపీ ఆశ్రయం పొందారు. జగన్ అధికారంలోకి రావడంతో తమను వెంటాడుతారని భావించిన పలువురు నాయకులు.. కమలం కండువా కప్పుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. వాళ్లపై జగన్ ఏమీ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీలో ఉంటే ప్రయోజనం శూన్యం. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో పవర్ లో ఉంటేనే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. కాబట్టి స్టేట్ లో పవర్ లోకి వచ్చే పార్టీలో చేరితే బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. అందుకే నాడు బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
నాడు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్లలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి తదితురులు ఉన్నారు. వీళ్లంతా టీడీపీలోకి మళ్లీ వెళ్లిపోతారనే టాక్ నడుస్తోంది. అయితే ఇటీవలే సుజనా చౌదరిని ఒక కీలక కమిటీకీ బాధ్యుడిని చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆయన పార్టీ మారతారనేది డౌటే. అయితే ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేశ్.. ఇటీవల టీడీపీతో పొత్తుపే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీతో పొత్తు ఉంటే బాగుంటుందని ఒకరు, ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు. ఈ విషయంలో ఆదినారాయణ రెడ్డికి సోము వీర్రాజు నోటీసులు జారీ చేసారు. అలా ఎందుకు కామెంట్ చేశారో చెప్పాలని కోరారు. మరోవైపు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ టీడీపీలో ఉన్నారు. కర్నూలులో లోకేశ్ పర్యటన సందర్భంగా కట్టిన బ్యానర్లలో టీజీ వెంకటేశ్ ఫోటో దర్శనమివ్వడంపై సోము వీర్రాజు వివరణ కోరినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. బీజేపీలో మొదటి నుంచి ఉన్న విష్ణు కుమార్ రాజు ఇటీవల ఆ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో పార్టీ వ్యవహార శైలిని తప్పుబట్టారు. టీడీపీతో కలవకుంటే పార్టీ మరింత దిగజారిపోవడం ఖాయమన్నారు. దీనిపై సోము వీర్రాజు రియాక్ట అయ్యారు. అలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీంతో వీళ్లంతా బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడయం ఖాయమని తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే రాష్ట్రంలో బీజేపీకి మనుగడ ఉండదు. అ పార్టీలో కొనసాగినా నో యూజ్. అందుకే ఎన్నికల నాటికి పలువురు కీలక నేతలు బీజేపీని వీడి టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.













