జగన్కు షర్మిల, విజయమ్మ ఝలక్ ఇవ్వబోతున్నారా..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అందుకే అంటూ ఉంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారు. ఆ పార్టీ విజయం కోసం అనునిత్యం శ్రమించారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని కలలు కన్నారు. కానీ ఆయన మరణానంతరం ఆయన కుటుంబం వేరు కుంపటి పెట్టుకుంది. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ కోసం కుటుంబమంతా కలిసి పని చేసింది. కానీ ఇప్పుడు వాళ్ల మధ్య విభేదాలు రావడంతో సోదరి షర్మిల, తల్లి విజయమ్మ.. జగన్ తో విభేదించి బయటకు వచ్చారు. తెలంగాణలో షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్సార్ అని చెప్పుకున్న ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడికక్కడ విడిపోయింది.
తెలంగాణలో రాజన్నరాజ్యం తెచ్చేందుకు వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. కాలికి బలపం కట్టుకుని అన్నట్టు రాష్ట్రమంత్రా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయినా అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఎన్నికలేమో సమీపిస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి.. లేకుంటే పడిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ప్రధాన పార్టీలతో పొత్తుకోసం ప్రయత్నించారు షర్మిల. కానీ ఎవరూ ముందుకు రాలేదు. మీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకేంటి అని బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే పొత్తు కాదు కానీ.. పార్టీని విలీనం చెయ్యి.. నీకు నువ్వు కోరుకున్న సీటు ఇస్తాం అని ఆఫర్ చేసింది. నీ సేవలను అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో వాడుకుంటామని చెప్పింది. ఉన్నంతలో ఇది కాస్త బెటర్ ఆప్షన్ అనిపించింది షర్మిలకు.
అందుకే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు షర్మిల దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తన తండ్రి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్ర రావు ఈ డీల్ సెట్ చేసినట్లు సమాచారం. తమది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కేడర్ కు చెప్పుకోవడానికి పెద్దగా ఇబ్బందులు ఉండవని షర్మిల భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్న సోదరుడు జగన్ తో ఇప్పుడు షర్మిల దూరంగా ఉంటున్నారు. కాబట్టి తన దారి తాను చూసుకోవడంలో తప్పు లేదనుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ చేసేందుకు షర్మిల దాదాపు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం ప్రక్రియ వేగవంతమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్.. షర్మిల భర్త అనిల్ కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు షర్మిల, విజయమ్మతో కూడా చర్చలు జరపనున్నారు. విలీనం అనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. జులై 8న ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే జగన్ కు పెద్ద సమస్య తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వైస్సాఆర్ కుటుంబం నిలువునా చీలినట్లేనని భావిస్తున్నారు. మున్ముందు షర్మిలను జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కోరుకున్నారు. ఇప్పుడు అదే నినాదంతో షర్మిల, విజయమ్మ పనిచేస్తే అది జగన్ కు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.













