Sajjala: కేసులన్నీ సజ్జల వైపే..!! అరెస్టు ఖాయమా..!?
ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతలందరూ ఒక్కొక్కరుగా జైళ్ల బాట పడుతున్నారు. అలాంటి వాళ్లు ఎక్కడున్నా వెంటాడి అరెస్టు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు అరెస్ట్ అయ్యారు. వీళ్లంతా ఇస్తున్న సమాచారంతో మరికొందరిపైన కూడా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ అరెస్టు అయినా వాళ్లలో ఎక్కువ మంది తాము కేవలం పాత్రధారులం మాత్రమేనని.. సూత్రధారులు వేరే ఉన్నారని విచారణలో వివరించారు. ఆ సూత్రధారి ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే.
జగన్ (YS Jagan) అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరొందారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy). అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ ఆయన వేలు పెట్టేవారు. ఆయా శాఖల్లో ఏం జరిగినా ఆయనే మీడియా ముందు వాలిపోయే వారు. మంత్రులతో సంబంధం లేకుండానే ఆయన మాట్లాడేసేవారు. జగన్ తర్వాత అన్నీ ఆయనే అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా అప్పుడు ఆయన చెప్పడం వల్లే తాము అలా చేయాల్సి వచ్చిందని కేసుల్లో అరెస్టు అయిన వాళ్లు చెప్తున్నారు. దీంతో సజ్జలపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డి కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఏ రేంజ్ లో రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఇప్పుడాయన్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపించింది. విచారణలో పోసాని కృష్ణ మురళి తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. పైగా తనను అలా మాట్లాడమని చెప్పింది సజ్జల రామకృష్ణా రెడ్డే అని.. తను స్క్రిప్టు పంపిస్తే తాను చదివానని వెల్లడించారు. తాను మాట్లాడిన వీడియోలను సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy) సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. దీంతో సజ్జలపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. విచారణలో పోసాని కృష్ణ మురళి తన పేరు చెప్పారని భావించిన సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తమను అరెస్టు చేస్తారని ఆందోళనగా ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాదంబరి జెత్వానీ (Kadambari Jetwani) కేసులో కూడా నిందితులు విచారణలో సజ్జల గైడెన్స్ వల్లే తాము అలా చేశామని చెప్పారు. దీంతో ఆ కేసులో సజ్జల కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. టీడీపీ హెడ్ ఆఫీసుపై దాడి కేసులో కూడా నిందితులు సజ్జల పేరు చెప్పారు. అంతకుముందు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై వర్ర రవీందర్ రెడ్డి కూడా సజ్జల పేరు బయటపెట్టారు. ఈ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇలా మెజారిటీ కేసుల్లో వేళ్లన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డి వైపే చూపిస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఆయన్ను ఆరెస్టు చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.













