సజ్జలను జగన్ పక్కన పెట్టేశారా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే మొదట గుర్తొచ్చేది జగన్ అయితే ఆ తర్వాత గుర్తొచ్చేది కచ్చితంగా సజ్జల రామకృష్ణా రెడ్డే.! 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సజ్జల అన్నీ తానై వ్యవహరించారు. ఆయన సకల శాఖా మంత్రి అని విపక్షాలు సెటైర్లు కూడా వేస్తుంటాయి. జగన్ స్పందించినా స్పందించకపోయినా ఆయన తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకొచ్చేసేవారు. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అస్సలు కనిపించట్లేదు. తాడేపల్లిలో కూడా ఆయన జాడ తెలియట్లేదనే టాక్ నడుస్తోంది. సజ్జలను జగన్ పక్కన పెట్టారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచేంత వరకూ సజ్జల రామకృష్ణా రెడ్డి తెరవెనుకే ఉండేవారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా ఆయన అంత యాక్టివ్ కాదు. విజయసాయి రెడ్డే జగన్ వెంట ఎక్కువగా కనిపించేవారు. అయితే కొంతకాలానికి విజయసాయి రెడ్డి సైడైపోయారు. ఆయన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేశారు. ఆయన్ను ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు జగన్. పార్టీ అయినా, ప్రభుత్వం అయినా ఆయనే. జగన్ దగ్గరికి ఎవరైనా వెళ్లాలంటే ముందు సజ్జల గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అంతలా పట్టు సాధించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు సజ్జల హవా చూసిన వైసీపీ నేతలు కంగు తినేవారు. జగన్ కంటే ఈయన పెత్తనమే ఎక్కువైపోయిందని చెప్పుకున్న నేతలు కూడా ఉన్నారు. అయితే భారతి అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే సజ్జల రామకృష్ణా రెడ్డి పెత్తనం సాగుతోందని కొందరు నేతలు గుసగుసలాడుకునేవారు. ఆ అండతోనే సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి పార్టీ డిజిటల్ వింగ్ మొత్తం చూసేవారు. అటు సజ్జల, ఇటు కుమారుడు భార్గవ్ ఇద్దరూ పార్టీపరంగా, ప్రభుత్వపరంగా కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. అప్పటి నుంచి సజ్జల పెద్దగా బయటకు రావట్లేదు. గతంలో చీటీకిమాటికీ మీడియా మందు వాలిపోయిన సజ్జల ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదని చర్చించుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ జగన్ వెంటే ఉండేవారు. కానీ ఇప్పుడు జగన్ బయటకు వచ్చినప్పుడు కూడా సజ్జల జాడ ఉండట్లేదు. తాడేపల్లికి కూడా సజ్జల వెళ్లట్లేదనేది సమాచారం. సజ్జల ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారని తెలుస్తోంది. సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందని పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే కుండబద్దలు కొడుతున్నారు. ఏకంగా సాక్షి చానల్లోనే ఓ అధికార ప్రతినిధి ఈ కామెంట్ చేశారు. దీంతో సజ్జలను ఇంకా భరిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన జగన్.. ఆయన్ను పక్కన పెట్టారని సమాచారం. ఆయన స్థానంలోనే సలహాదారుగా ఆళ్ల మోహన సాయి దత్ ను నియమించుకున్నట్టు తెలుస్తోంది.













