చంద్రబాబును రామ్ గోపాల్ వర్మ అంతమాట అనేశాడేంటి..?
రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు. ఒకప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడు. అయితే ఇప్పుడు ఆ పాపులారిటీని మొత్తం పోగొట్టుకుని పనికిమాలిన సినిమాలు తీస్తూ ఉన్న పరువును కూడా తనకు తానే తీసేసుకుంటున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా ఇష్టం అనే యాటిట్యూడ్ తో ఉంటారు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాలు ఎవరు చూడకపోయినా పర్లేదనేది ఆర్జీవీ మెంటాలిటీ. తన సినిమాలు చూడాలని తాను ఎవర్నీ అడుక్కోనని చెప్తుంటారు కూడా. దీంతో ఆర్జీవీ సినిమాలను చూసేందుకు కూడా ఎవరు సాహసించట్లేదు. సరే.. సినిమాల సంగతి పక్కనపెడదాం.. అప్పుడప్పుడు ఆర్జీవీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా పాలిటిక్స్ పై మాట్లాడి తాను కూడా తోపునని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
తాజాగా చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలపై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. చంద్రబాబును హిట్లర్, ముస్సోలినితో పోల్చుతూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. ఇటీవల కుందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జనవరి ఫస్ట్ రోజు గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. మొత్తం 11 మంది ఈ రెండు ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం సంచలనం కలిగించింది. ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ఫోటోషూట్ లు, డ్రోన్ షాట్లకోసం కావాలనే అమాయకుల ప్రాణాలు బలికొన్నారని అధికార వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు సభలకు పెద్దఎత్తున జనం వస్తున్నారని.. వారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
తొక్కిసలాటలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అయితే ఈ ఘటనలను రాజకీయంగా వాడుకునేందుకు అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన కోణంలో విశ్లేషించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబును నియంతతో పోల్చారు. పాపులారిటీకోసం ఎంతటి నీచానికైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుది అని వర్మ సంబోధించారు. ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డిపోచతో సమానం.. పర్ననల్ ఇగో, పర్సనల్ గెయిన్ తప్ప చంద్రబాబుకు ప్రజలంటే లెక్కేలేదన్నారు. ఎంతమంది చనిపోతే తనకు అంత పాపులారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తారన్నారు వర్మ. హిట్లర్, ముస్సోలని తర్వాత అలాంటి వాణ్ణి నిన్నే చూస్తున్నానన్నారు. వాళ్లు ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చేవాళ్లని.. ఇప్పుడు నువ్ కూడా అలాగా కానుకలు ఇస్తున్నావని చెప్పారు. మీరు అని పిలిచేందుకు అర్హతలేదన్న వర్మ.. ఇకపై నిన్ను అని పిలుస్తున్నట్టు చెప్పారు. అమాయకులను చంపి.. వాళ్ల మీద నిల్చొని.. పాపులారిటీ సంపాదించాలనుకోవడంపై … ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదన్నారు వర్మ.
వర్మ కామెంట్స్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వర్మ తన పనేదా తాను చేసుకోవాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. అధికార వైసీపీ తరపున మాట్లాడడం మాని ఆ పార్టీలో చేరాలని హితవు పలుకుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా ఆ మధ్య వర్మ కొన్ని సినిమాలు తీశారు. త్వరలోనే మరో రెండు సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా చేశారు వర్మ. ఈ సినిమాలకు వైసీపీకి చెందిన నేతే నిర్మాత. వైసీపీ కార్యకర్తగా పనిచేయడం మాని.. బుద్ధిగా సినిమాలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు సూచిస్తున్నాయి. కానీ వర్మ అందరిలాంటి వాడు కాదు. తనో టైపు.. అంతే..!













