రేపే రాయలసీమ గర్జన..! పార్టీల మధ్య మాటల తూటాలు..!!
రాయలసీమ గర్జనకు కర్నూలు ముస్తాబవుతోంది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడంతో పాటు శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి ఈ గర్జన నిర్వహిస్తోంది. కర్నూలు వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రాయలసీమ జేఏసీ పేరుమీద నిర్వహస్తున్నా.. ప్రభుత్వమే అన్నీ తానై నిర్వహిస్తోంది. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, నగర మేయర్ బి.వై.రామయ్య.. తదితరులు దగ్గరుండి చూసుకుంటున్నారు. లక్ష మందితో ఈ గర్జన నిర్వహించాలని రాయలసీమ జేఏసీ భావిస్తోంది. రాయలసీమ జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యక్రమానికి తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అయితే రాయలసీమ గర్జనపై టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జేఏసీ ఏర్పాటైంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు కావాలి. కానీ అప్పుడు రాజధాని ఏర్పాటు చేయలేదు. దీంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని రాయలసీమ జేఏసీ ఆరోపిస్తోంది. అందుకే అప్పుడు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా సరిదిద్దాలని డిమాండ్ చేస్తోంది. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే ఏమొస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందని జేఏసీ అధ్యక్షుడు వెంకటర రమణా రెడ్డి చెప్తున్నారు. అంతేకాక ఇండస్ట్రియల కారిడార్ ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీరిపోతుందని వెల్లడించారు. అందుకే రాయలసీమ గర్జనకు పార్టీలకతీతంగా మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే రాయలసీమ గర్జనపై టీడీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఇప్పుడు కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని వైసీపీ ఆరాటపడుతోందని.. అలాంటప్పుడు నాడు అమరావతి రాజధానికి జగన్ ఎందుకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని ప్రశ్నిస్తోంది. బ్రిటీష్ వాళ్లు అనుసరించిన విభజించు – పాలించు నినాదంతో తాము లబ్ది పొందేందుకే మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కర్నూలులో కేవలం న్యాయరాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చెందదని.. ఈ ప్రాంత వనరులను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ప్రకటించి దానికి అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అయితే వైసీపీ నేతల వల్ల ఈ ప్రాంతంలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలు కూడా తరలిపోతునన్నాయని.. వాటిపైన వైసీపీ నేతలు స్పందించట్లేదని చెప్తున్నారు. కర్నూలుపై అంత ప్రేమ ఉన్నప్పుడు అమరావతికి ఎందుకు మద్దతిచ్చావ్ అని జగన్ ను ఈ ప్రాంత వాసులంతా ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అడుగుతోంది. రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ చేస్తున్న హడావుడి హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీలో నాటి సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని తులసిరెడ్డి గుర్తు చేస్తున్నారు. అందువల్ల అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ గెజిట్ ఏర్పడిందని.. దానికి తగ్గట్టు అక్కడ హైకోర్టు, జడ్జిలు, లాయర్లకు భవనాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. అంతేకాక.. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడం ముగిసిన అధ్యాయమని ప్రభుత్వ తరపు న్యాయవాది కె.కె.వేణుగోపాల్ 2022 నవంబర్ 28న సుప్రీంకోర్టులో చెప్పిన విషయాన్ని తులసిరెడ్డి గుర్తు చేస్తున్నారు. కర్నూలుకు అన్యాయం జరగడానికి టీడీపీ ఎంత కారణమో వైసీపీ కూడా అంతే కారణమని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు నవమోసాలు చేసిందని దుయ్యబట్టారు.
అయినా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నినాదంతోనే ముందకెళ్తోంది. కర్నులులో న్యాయరాజధాని ఏర్పాటు చేసి తీరుతామని చెప్తోంది. ఇందుకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన అడ్డుతగులుతున్నాయని.. ఆయా పార్టీల నేతలను రాయలసీమవాసులు ప్రశ్నించాలని డిమాండ్ చేస్తోంది.













