Raj Kasireddy: అంత తొందరెందుకు..!? ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి..!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున లిక్కర్ స్కాం (Liquor Scam) జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy), సిట్ నోటీసులపై ఆడియో రిలీజ్ చేశారు. ఇదిప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ కసిరెడ్డి తప్పుబట్టారు. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై (Vijayasai Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలోనే ఆయన చరిత్రను బయటపెడతానని హెచ్చరించారు.
సిట్ (SIT) తనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరిందని.. దీనిపై తాను 24 గంటల్లోనే స్పందించానని రాజ్ కసిరెడ్డి ఆడియోలో పేర్కొన్నారు. “నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ఏమైనా డాక్యుమెంట్లు తీసుకురావాలా?” అని సిట్‌ను అడిగినట్లు చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని, అయితే సిట్ నుంచి రెండో నోటీసు వచ్చినట్టు వెల్లడించారు. ఈ నోటీసులో ప్రాథమిక సమాచారం అందించాలని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. తాను లేని సమయంలో తన తల్లికి నోటీసులు ఇచ్చారని, ఇది అనైతికమని అభివర్ణించారు. సాక్షిగా విచారణకు పిలిచి, తనను అరెస్టు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తోందని న్యాయవాదులు సూచించినట్టు ఆయన తెలిపారు. అందుకే సిట్ నోటీసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) సవాల్ చేశానన్నారు. అలాగే ముందస్తు బెయిల్ (bail) కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై రాజ్ కసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను “బట్టేబాజ్”గా అభివర్ణించిన రాజ్ కసిరెడ్డి.. త్వరలోనే ఆయన చరిత్రను అందరి ముందు బహిర్గతం చేస్తానన్నారు. అప్పటివరకు మీడియా ఒకవైపు వార్తలు ప్రచురించవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. విజయసాయి రెడ్డి ఇప్పటికే ఈ కేసులో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ స్కాంకు కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని ఆయన ఇప్పటికే మీడియా ముందు కూడా వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో సిట్ ముందు రాజ్ కసిరెడ్డి హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన సిట్, ఆయన కదలికలను గుర్తించేందుకు లుక్అవుట్ నోటీసు (ఎల్ఓసీ) జారీ చేసింది. రాజ్ కసిరెడ్డి మద్యం కంపెనీల నుంచి నెలవారీ కమీషన్లు సేకరించి దాదాపు రూ.వేల కోట్లకు పైగా ఉన్నత స్థాయి వ్యక్తులకు చేరవేశారనేది ప్రధాన అభియోగం. రాజ్ కసిరెడ్డి సినిమా నిర్మాణంలో కూడా పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది.
తాను విచారణకు సిద్ధంగా ఉన్నానన్న రాజ్ కసిరెడ్డి.. అరెస్టు భయంతోనే హాజరు కావట్లేదని అర్థమవుతోంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై నిర్ణయం వచ్చే వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, విజయసాయి రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు ఈ కేసును మరింత జటిలం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.













