మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రఘువీరా రెడ్డి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్.రఘువీరా రెడ్డికి ఒక ప్రత్యేక స్థానముంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఆయన పని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ కీలక నేతల్లో ఆయన ఒకరు. కానీ రాష్ట్ర విభజన చాలా మంది రాజకీయ నేతలకు ఉపాధి లేకుండా చేసింది. అలా రాజకీయాలకు దూరమైన వారిలో రఘువీరా రెడ్డి ఒకరు. 2014 ఎన్నికల తర్వాత ఆయన పాలిటిక్స్ కు విరామం ప్రకటించారు. అప్పటి నుంచి హ్యాపీగా సొంతూరిలో కుటుంబంతో గడుపుతూ ఉండిపోయారు.
అయితే రఘువీరా రెడ్డి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటరవుతున్నారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలను అక్కడ ఇన్ ఛార్జ్ లుగా నియమిస్తోంది. అలా బెంగళూరు సిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా రఘువీరారెడ్డి నియమితులయ్యారు. వాస్తవానికి బెంగళూరుతో రఘువీరా రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. బంధుగణం ఉంది. సిటీ రాజకీయ నేతలు కూడా పేరు పెట్టి పిలిచేంత సుపరిచితులే. అందుకే రఘువీరా రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.
హైకమాండ్ అప్పగించిన బాధ్యతలను రఘువీరా రెడ్డి ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా ఆ బాధ్యతలను చేపట్టేందుకు రఘువీరా రెడ్డి సిద్ధమయ్యారు. బెంగళూరు వెళ్లే ముందు సొంతూరు అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో సన్నిహితులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం బాధాకరమన్నారు. మోదీ ఇంటిపేరున్న వాళ్లంతా దొంగలు అనలేదని.. పెద్ద పెద్ద దొంగలకు మోదీ ఇంటిపేరుగా ఉందని మాత్రమే అన్నారని చెప్పారు. ఇంతకంటే పెద్ద నేరాలు చేసి జైలు శిక్ష పడిన వాళ్లు కూడా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారన్నారు. ఆయన ఇంటిని కూడా ఖాళీ చేయించడాన్ని తాను తట్టుకోలేకపోతున్నానన్నారు.
మొత్తానికి రఘువీరా రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తుండడంతో ఆయన సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరొందిన రఘువీరారెడ్డి అలా కామ్ గా ఇంటికే పరిమితమవడాన్ని ఆయన సన్నిహితులు, తోటి రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన రాకతో ఏపీ కాంగ్రెస్ లో కాస్త కదలిక వస్తుందని మాత్రం చాలా మంది నమ్ముతున్నారు.













