రఘువీరాకు మరో కీలక పదవి ఖాయమా…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. దశాబ్దాలపాటు కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోరు నడిచేది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టు వివిధ పార్టీల్లో చేరిపోయారు. కొందరు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. అలాంటి వారిలో రఘువీరా రెడ్డి ఒకరు. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ఆయన కొన్నేళ్లుగా సొంతూరికే పరిమితమైపోయారు. కానీ ఇప్పుడాయనకు సీడబ్లూసీలో స్థానం కల్పించి సంచలనం కలిగించింది కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే ఆయనకు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
రఘువీరా రెడ్డి 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన నిబద్దత కలిగిన కార్యకర్తగా ఉంటున్నారు. వివిధ సందర్భాల్లో పలు పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన వెళ్లలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మంత్రిగా పని చేశారు. అనంతరం రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. నేతలెవరూ లేకుండా పోయారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఛీత్కరించడం మొదలుపెట్టారు. జనంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రఘువీరా రెడ్డి స్వచ్చంధంగా తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఉండిపోయారు.
నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు రఘువీరా రెడ్డి. పలు సందర్భాల్లో రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అనుచరులు కోరినా ఆయన చిరునవ్వుతో తిరస్కరించారు. అయితే కర్నాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పిలిచి మరీ 24 నియోజకవర్గాల బాధ్యత అప్పగించింది. బెంగళూరు పరిధిలోని ఈ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు రఘువీరా రెడ్డి. తనకు అప్పగించిన వాటిలో 18 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంతకుముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించినప్పుడు సరిహద్దు వద్ద రఘువీరా రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడినప్పుడు రఘువీరా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ మళ్లీ అందరి చూపు రఘువీరా పైన పడేలా చేశాయి.
ఇప్పుడు రఘువీరా రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని గుర్తింపు లభించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క రఘువీరా రెడ్డికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. దీన్నిబట్టి రఘువీరా రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటితో ఆగకుండా కర్నాటక నుంచి రఘువీరా రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేస్ అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అలా చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ తరపున పార్లమెంటులో వాయిస్ వినిపించే అవకాశం కలుగుతుందనేది ఆ పార్టీ భావన. ఏమో చెప్పలేం.. అది కూడా జరగవచ్చేమో.. వేచి చూద్దాం.













