RRR: వేటాడుతున్న రఘురామ, తప్పించుకోవడం కష్టమే…!
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజును (RRR) కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో నిందితులు చుక్కలు చూస్తున్నారు. రఘురామకృష్ణంరాజును తక్కువ అంచనా వేసిన పోలీస్ అధికారులు అలాగే కొంతమంది రాజకీయ నాయకుల విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. రఘురామ కృష్ణం రాజును అప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసిన వారిని ఒక్కొక్కరిని ఇప్పుడు జైలుకు పంపుతున్నారు అధికారులు. తాజాగా గుడివాడకు చెందిన కామేపల్లి తులసి బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రఘురామ కృష్ణంరాజును హింసించిన రోజు రాత్రి ఆయన గుండెలపై కామేపల్లి తులసి బాబు కూర్చున్నట్టు రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 115 కేజీల బరువున్న వ్యక్తి తన గుండెలపై కూర్చున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు ఒక లేఖ కూడా రాశారు. తులసి బాబు పలుమార్లు విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆయన అరెస్టు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. బుధవారం సాయంత్రమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచి గుంటూరు జైలుకు తరలించారు. ఇక తాజాగా ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న విజయపాల్ బెయిల్ కోసం ప్రయత్నం చేసినా నిరాకరించింది కోర్ట్. సిఐడి ఏఎస్పీగా విధులు నిర్వహించిన.. విజయ్ పాల్ రఘురామకృష్ణంరాజును హింసించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన విషయంలో రఘురామా చాలా పకడ్బందీగా వ్యవహరించి ప్రతి సాక్ష్యాన్ని సేకరించి కేసు నమోదు చేయించారు.
ఇక తాజాగా విజయపాల్ (Vijaypaul) గుంటూరు జిల్లా రెండో అదనపు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… ఆ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. అటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతి కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమెకు కూడా బెయిల్ నిరాకరించారు. దీనితో త్వరలో ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా తనని వేధించిన ప్రతి ఒక్కరిని రఘురామా జైలుకు పంపిస్తున్నారు.













