అమరావతి భూములను పంచేస్తున్న జగన్.. మాస్టర్ ప్లాన్ హుళక్కేనా..?
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే అమరావతికోసం ప్రభుత్వం పేదల నుంచి దాదాపు 33వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించింది. భూములిచ్చిన వారికి అభివృద్ధి చేసిన స్థలాలివ్వాలని మాస్టర్ ప్లాన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ అటకెక్కింది. దాని సంగతి అటుంచితే అసలు అమరావతి రాజధానికే ఉనికే లేకుండా పోతోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అమరావతి భూములను పేదలకు పంచేందుకు జగన్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లస్థలాలివ్వాలని జగన్ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కొన్ని ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే కొనుగోలు చేసి పంచుతోంది. అమరావతిలో ప్రభుత్వం భూమి నిండుగా ఉంది. అమరావతిలో అందరూ బడా నేతలే భూములు కొన్నారని, ఇక్కడ పేదలకు స్థానం లేకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే రాజధాని అమరావతిలో కూడా పేదలకు ఇళ్లస్థలాలివ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1134 ఎకరాల్లో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. రాజధానిలో పేదలకు కూడా స్థానం ఉండాలని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది తెలీదు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడంతో జగన్ సర్కార్ తన పనితాను చేసుకుంటూ పోతోంది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పేదలకు కూడా అమరావతిలో ఇంటిపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు చేసిన విజ్ఞప్తి మేరకు మరో 268 ఎకరాలను సీఆర్డీఏ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. దీనికోసం ఎకరా భూమికి ప్రభుత్వం రూ.24.40 లక్షలు చెల్లించాలని సీఆర్డీఏ కోరింది. మొత్తానికి ఆర్ 5 జోన్ పై ఇప్పటికే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి సీఆర్డీఏ నుంచి భూములు తీసుకుని పేదలకు పంచుతుండండ రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు.













