పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు.. సీఎం అభ్యర్థి ఆవిడే..!
ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఆమెకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విభేదించి కాంగ్రెస్ లో చేరింది దగ్గుబాటి వెంకటేశ్వర రావు కుటుంబం. అందులో భాగంగా పురంధేశ్వరిని కేంద్ర మంత్రిని చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే విభజనానంతర పరిణామాల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరారు. అయితే కేంద్రంలో రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా పురంధేశ్వరికి మాత్రం పదవులు దక్కలేదు. పార్టీ పదవులకే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ఈసారి ఆమె పార్టీ మారుతుందేమోననే ఊహాగానాలు బలంగా వినిపించాయి. దీంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తం అయినట్లుంది.
ఏపీ బీజేపీ పగ్గాలు త్వరలోనే మారుతాయనే ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీలో సీనియర్లను సైతం సోము వీర్రాజు పట్టించుకోవట్లేదని.. ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్నారని ఆరోపణలున్నాయి. కన్నా లక్ష్మినారాయణ లాంటి సీనియర్ నేతలే సోము వీర్రాజు తీరుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు.. సోము వీర్రాజు పనితీరుపైన కూడా బీజేపీ హైకమాండ్ సంతృప్తిగా లేదు. ఆయన నేతృత్వంలో పార్టీ బలపడకపోగా.. రోజురోజుకూ వీక్ అవుతోందనే భావనలో ఉంది. అందుకే త్వరలోనే సోము వీర్రాజును మార్చి మరో నేతకు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది.
ఏపీ బీజేపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గానే చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవలి జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇది ప్రధాన అంశంగా మారింది. అయితే మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి పగ్గాలు ఇవ్వడం అన్నివిధాలా శ్రేయస్కరం అని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. పురంధేశ్వరి సామాజిక వర్గం, టీడీపీ, వైసీపీల్లో ఆమెకున్న పరిచయాలు.. లాంటి అనేక అంశాలు బీజేపీ బలోపేతానికి దోహదం చేస్తాయని కమలం పార్టీ అంచనా వేస్తోంది. ఏపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలదే ఆధిపత్యం. పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఏపీలో కమ్మలంతా టీడీపీకి కొమ్ముకాస్తారనే పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరికి పగ్గాలివ్వడం ద్వారా టీడీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను ఆకట్టుకోవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉంటాం కాబట్టి ఏపీలో పార్టీ బలోపేతానికి ఈ ఎత్తుగడ దోహదం చేస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అయితే బీజేపీతో ప్రయాణం అంత సాఫీగా సాగట్లేదని దగ్గుబాటి ఫ్యామిలీ బావిస్తోంది. పురంధేశ్వరి బీజేపీలో కీలకంగా ఉన్నప్పుడే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు హితేశ్ వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో హితేశ్ కు బదులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు బరిలోకి దిగినా విజయం దక్కలేదు. అప్పటి నుంచి అటు వైసీపీలో కూడా దగ్గుబాటి, హితేశ్ యాక్టివ్ గా లేరు. అయితే ఇటీవలే తాము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. కానీ టీడీపీలో చేరేందుకే దగ్గుబాటి ఈ ప్రకటన చేశారనే ఊహాగానాలు వినిపించాయి. గతంతో పోల్చితే నారా, దగ్గుబాటి ఫ్యామిలీల మధ్య గ్యాప్ తగ్గింది. రెండు కుటుంబాలు పలు వేదికల్లో కనిపిస్తూ దగ్గరయ్యారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ లాంటి పార్టీలను నమ్ముకోవడం కంటే సొంత పార్టీ టీడీపీలో ఉంటేనే బెటర్ అనే ఫీలింగ్ కు దగ్గుబాటి ఫ్యామిలీ వచ్చిందని సమాచారం. అందుకే త్వరలోనే టీడీపీ గూటికి చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ పురంధేశ్వరిని ఎలాగైనా వదులుకోకూడదని భావిస్తున్న బీజేపీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాక.. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పురంధేశ్వరిని బరిలోకి దించి సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే పురందేశ్వరి బీజేపీలోనే ఉంటారా.. లేకుంటే ఫ్యామిలీ అంతా టీడీపీ గూటికి చేరుతుందా అనేది తెలియాల్సి ఉంది.













