Punganur: అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు..! పెద్దిరెడ్డి పెత్తనానికి బ్రేక్..!?

ఇన్నాళ్లూ చిత్తూరు జిల్లా (Chittoor District) పరిధిలో ఉన్న పుంగనూరు నియోజకవర్గం (Punganur assembly) అన్నమయ్య జిల్లాలోకి (Annamayya District) మారడానికి రంగం సిద్ధమైంది. దీంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ రాజకీయ ప్రభావానికి గండి పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరును అన్నమయ్య జిల్లాలోకి మార్చే అంశంపై నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం అన్నమయ్య జిల్లా రాజకీయ సమీకరణలను మార్చడమే కాక, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ పట్టును సవాలు చేసే అంశంగా మారనుంది.
2022లో వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టినప్పుడు, పార్లమెంటు నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని మాత్రం అన్నమయ్య జిల్లాలో చేర్చకుండా చిత్తూరు జిల్లాలోనే కొనసాగించారు. ఈ నిర్ణయం వెనుక అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని విమర్శలు వచ్చాయి. రాజంపేట (Rajampet) పరిధిలోని ఇతర నియోజకవర్గాలన్నీ అన్నమయ్య జిల్లాలో చేరినప్పటికీ, పుంగనూరును చిత్తూరులో ఉంచడం రాజకీయ కారణాల వల్లేనని విపక్షాలు ఆరోపించాయి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రభావాన్ని కొనసాగించారు. పులిచర్ల మండలం చిత్తూరు జిల్లాలో ఉండటం వల్ల పెద్దిరెడ్డి రెండు జిల్లాల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. అదే సమయంలో, పుంగనూరు నియోజకవర్గం ద్వారా మిథున్ రెడ్డి కూడా రెండు జిల్లాల్లో రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించారు.
తాజాగా, అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు చేరికకు మార్గం సుగమమైంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లోని 11 మండలాలతో పాటు, పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, రొంపిచెర్ల మండలాలు అన్నమయ్య జిల్లాలో చేరనున్నాయి. ప్రస్తుతం 30 మండలాలున్న అన్నమయ్య జిల్లా మండలాల సంఖ్య 35కు పెరగనుంది. అలాగే, జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య కూడా ఆరు నుంచి ఏడుకు పెరుగుతుంది. పులిచర్ల మండలం విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ, పుంగనూరు చేరిక ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు సమాచారం.
పుంగనూరు అన్నమయ్య జిల్లాలోకి వెళ్లడం వల్ల చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ప్రభావం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉండటం వల్ల పెద్దిరెడ్డి కుటుంబం రెండు జిల్లాల్లో రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. అయితే, ఈ చేరికతో చిత్తూరు జిల్లాలో వారి ప్రభావం పరిమితం కానుంది. అదనంగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇప్పటికే భూ ఆక్రమణ ఆరోపణలు కూడా ఉన్నాయి. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు విజిలెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ వివాదం కూడా పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చేరడం వల్ల స్థానిక రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో వైసీపీ బలం కొనసాగినప్పటికీ, చిత్తూరు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైనందున, ఈ మార్పు రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి రాజకీయ వ్యూహాలను కూడా ప్రభావితం చేయవచ్చు. అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు చేరిక రాజకీయంగా, పరిపాలనపరంగా ముఖ్యమైన అడుగు. ఈ చేరికతో అన్నమయ్య జిల్లా పరిధి విస్తరిస్తుంది. అదే సమయంలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ ప్రభావం తగ్గే అవకాశం ఉంది.