Pulivarthi Nani: సవాళ్లు, ఆరోపణలు ..రాజకీయంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న నాయకులు..
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో(Chandragiri) రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, ప్రజల్లో ఉత్కంఠ పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) , ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని (Pulivarthi Nani) కుటుంబం మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudha Reddy) , చెవిరెడ్డికి సవాల్ విసరడం మరింత కాంట్రవర్సీ గా మారింది. గత కొంతకాలంగా తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన సుధారెడ్డి, చెవిరెడ్డికి బహిరంగ సవాల్ చేశారు. “నాపై అవినీతి ఆరోపణలు చేయడం కాదా? నిలో నిజాయితీ ఉంది అన్న నమ్మకం ఉంటే ఆధారాలతో రా!” అంటూ ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద సమావేశమవుదామని ప్రకటించారు. అంతేకాదు, చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఆయన తన సవాల్‌ను స్వీకరిస్తారా? అనే ఉత్కంఠతో అందరూ ఎదురుచూస్తుండగా, పులివర్తి సుధారెడ్డి సమయానికి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. అయితే, చెవిరెడ్డి మాత్రం అక్కడికి రాలేదు. దీంతో తానే స్వయంగా ఆయనకు ఫోన్ చేసి, ఆరోపణలు చేసినప్పుడు చర్చకు సిద్ధమని చెప్పి ఇప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె పలుమార్లు ఫోన్ చేసినా, చెవిరెడ్డి స్పందించకుండా ఉండిపోయారు. దీంతో, “చెవిరెడ్డి భయపడ్డారు. నిజం మా వైపే ఉంది కాబట్టే రావడానికి సాహసించలేదు” అని సుధారెడ్డి పేర్కొన్నారు
ఆమె మాటలు విన్న అనుచరులు మరింత రెచ్చిపోయారు. చెవిరెడ్డిపై కఠిన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. అసలు, ప్రజా ప్రతినిధులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయంలో కొత్త కాదు. కానీ, ఇది ప్రజలకు ఎంత వరకు ఉపయోగకరం? వీరు ఒకరి మీద ఒకరు పోటీ పడడం, పరస్పరం విమర్శలు చేసుకోవడం ఎంతవరకు అవసరం? అసలు రాజకీయాలలో ఇలాంటి హైప్ అవసరమా? ప్రజా సేవే ప్రధాన లక్ష్యం అయితే, అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ఆరోపణలతో కాలం వెళ్లదీయడం సమంజసమా?
సుధారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయాల్లో కేవలం ప్రజాసేవ కోసమే ఉన్నామని, అభివృద్ధే లక్ష్యమని చెప్పారు. అయితే, చెవిరెడ్డి మాత్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఆరోపించారు. ప్రభుత్వ విప్‌గా, తుడా ఛైర్మన్‌గా తన హోదాను ఉపయోగించుకుని కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆమె ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, ఇవన్నీ ఎన్నికల సంఘానికి తెలియజేస్తానని వెల్లడించారు. ఇలాంటి వివాదాలు ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడతాయి? ఒక రాజకీయ నాయకుడు అవినీతిపరుడు అని నిరూపించాలంటే చట్టపరమైన మార్గాలు ఉన్నాయి.
కానీ, ఇలా బహిరంగంగా సవాళ్లు విసిరి, మీడియా సమావేశాలు పెట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయా? కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఇలా చేస్తున్నారా? అనేది గమనించాల్సిన విషయం. రాజకీయాలు పరస్పర ఆరోపణలకు వేదిక కాకుండా, అభివృద్ధికి వేదిక కావాలి. కానీ, ఇప్పుడు చూస్తుంటే, నాయకులు ప్రజా సమస్యల గురించి కన్నా, ఒకరిపై ఒకరు విమర్శలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అనిపిస్తోంది. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గించేలా చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, సమస్యలకు పరిష్కారం చూపించడం నాయకుల బాధ్యత. ఈ వివాదం రాజకీయ నాటకమా, లేదా నిజమైన ప్రజాస్వామ్య పోరాటమా? అన్న విషయం పై ఇంకా క్లారిటీ మాత్రం లేదు.













