గలీజ్ పనులతో బజారున పడుతున్న నేతలు..!!
రాజకీయాలకు ఎక్కడైనా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అన్ని వ్యవస్థలనూ శాసించగల అధికారం దాని సొంతం. అందుకే అందరూ రాజకీయాల్లోకి ప్రవేశించాలని.. ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. అదృష్టం దక్కిన కొంతమంది నేతలు రాజకీయాలను పవిత్రంగా భావించి సేవ చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం దాన్ని ఆయుధంగా వాడుకుని అడ్డమైన పనులూ చేస్తుంటారు. ఇటీవలికాలంలో చాలా మంది నేతలు ఇలాంటి అడ్డమైన పనులు చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. పరువు ప్రతిష్టలను బజారున పడేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా నేతల ప్రైవేటు వ్యవహారాలపై జోరుగా చర్చ జరుగుతోంది. కొంతమంది నేతల అక్రమ సంబంధాల గుట్టు రట్టు కావడం సంచలనం కలిగించింది. గంట, అరగంట అంటూ ఆ మధ్య కొంతమంది నేతల ఆడియో కాల్స్ బయటికొచ్చాయి. ఓ ఎంపీ న్యూడ్ కాల్స్ వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ ఎమ్మెల్సీ ముద్దులు పెడుతూ కనిపించారు. మరో ఎమ్మెల్యే ఓ మహిళతో అడల్ట్రీ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఓ మహిళతో సాగించిన రాసలీలలు బట్టబయలయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నేతలు ప్రైవేటు వ్యవహారాలు వాళ్ల కెరీర్ ను నాశనం చేశాయి.
రాజకీయ నేతలకు సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. ఎంతోమంది తమ అవసరార్థం వాళ్ల దగ్గరకు వస్తుంటారు. అయితే కొంతమంది నేతలు అలా వచ్చిన వాళ్లను నయానో భయానో లోబరుచుకుంటున్నారు. ఇది ఒక యాంగిల్. కొంతమంది మహిళలు రాజకీయ నేతలతో చనువుగా ఉంటూ వారికి లొంగిపోతున్నారు. ఇది రెండో యాంగిల్. ఏదైతేనేం వాళ్ల మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నంత వరకూ అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైనా వ్యవహారం బెడిసి కొడితే మాత్రం తెరవెనుక సిత్రాలన్నీ బయటికొట్టేస్తున్నాయి. అప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేసినా ఉపయోగం లేకుండా పోతోంది.
రాజకీయ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. హోదా, అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి రాసలీలలు సాగిస్తే ఏదో ఒక రోజు అవి బయటకు రాక మానవు. వచ్చినప్పుడు తన తప్పేమీ లేదని.. అంతా కుట్ర అని అరిచి గగ్గోలు పెట్టినా ఉపయోగం ఉండదు. దొరకనంత వరకూ దొరలా ఉండొచ్చు. దొరికితే మాత్రం దొంగే.! అప్పుడు ఎవరూ కాపాడలేరు. తమను ఎవరు చూడట్లేదు కదా అని నమ్మకంతో బరితెగిస్తే మాత్రం కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోవచ్చు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది.













