వైజాగ్ వస్తున్న ప్రధాని మోదీ..! రాజధాని, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్‌పై స్పందిస్తారా..?
చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు. వచ్చే నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్, గిరిజన యూనివర్సిటీ లాంటి వాటికి ప్రధాని శంకుస్థాపన చేస్తారని సమాచారం.
విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అధికార వైసీపీ ఉత్సాహం చూపిస్తోంది. అందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని చూస్తోంది. అయితే విశాఖ వాసుల చిరకాల కోరికైన రైల్వే జోన్ అంశం మోదీకి ఇబ్బందిగా మారింది. దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన తప్ప ముందడుగు పడలేదు. ఇది ఇప్పటికీ డోలాయమానంలోనే ఉంది. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా రచ్చ రాజేస్తోంది. కేంద్రం ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీన్ని కార్మికులు, పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించబోతున్నారు. వైజాగ్ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై మోదీ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మోదీ చేతుల మీదుగానే రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి అమరావతి కేంద్రంగానే పాలన సాగుతోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైసీపీ తప్ప మిగిలిన టీడీపీ, జనసేన, బీజేపీ .. అమరావతికి అనుకూలంగా ఉన్నాయి. తాము అమరావతికి అనుకూలమని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ప్రధాని పర్యటనలో రాజధాని అంశంపై ఏదైనా ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. రాజధానిపై ఒకవేళ మోదీ ప్రకటన చేస్తే అది ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పడు చాలా రక్తి కట్టిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అన్ని పార్టీలూ మోదీకి అనుకూలంగానే ఉన్నాయి. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన.. బీజేపీతో స్నేహం కోసం తపిస్తున్నాయి. జనసేన ఇప్పటికే బీజేపీతో కలిసి పని చేస్తోంది. టీడీపీ కూడా బీజేపీతో కలిసి పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని జనసేన, టీడీపీ .. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ మాత్రం.. విభజన అంశాలు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు.. లాంటి అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ విశాఖ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. మోదీ పర్యటనలో పార్టీల తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఇలాంటి వివాదాస్పద అంశాల జోలికి ప్రధాని మోదీ వెళ్లకపోవచ్చనేది విశ్లేషకుల మాట. మరి చూడాలి ఏం జరుగుతుందో.!













