Perni Nani : పేర్ని నాని దంపతులు మేనేజర్‌ను బలిపశువును చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పేర్ని నాని (Perni Nani) ఇష్యూ హాట్ టాపిక్ గా ఉంది. ఆయన కుటుంబానికి చెందిన గోడౌన్ లో బియ్యం మాయం కావడం, దానికి ఆయన జరిమానా చెల్లించడం జరిగిపోయాయి. అయితే దీనిపై లోతుగా విచారిస్తున్న కొద్దీ సరికొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ అంశంపై పోలీసులు కేసు పెట్టారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విచారణలతో తమ తప్పేమీ లేదని.. దీనికంతటికీ కారణం గోడౌన్ మేనేజరేనని చెప్తున్నారు పేర్ని నాని కుటుంబీకులు. అయితే లావాదేవీలు మాత్రం పేర్ని నాని ఫ్యామిలీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు తమ గోడౌన్ (JS Godown) ను పౌరసరఫరాల శాఖకు (Civil Supplies Corporation) లీజుకు ఇస్తూ 2023 జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. ఈ గోడౌన్ పేర్ని నాని భార్య జయసుధ (Perni Jayasudha) పేరిట ఉంది. అప్పుడే మేనేజర్ గా మానస తేజ్ (Manasa Tej), టెక్నికల్ అసిస్టెంట్ గా ప్రత్యూష నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ గోడౌన్ లో బియ్యం నిల్వ ఉంచుతున్నారు. అయితే కాకినాడ పోర్టు (Kakinada Port) నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని గ్రహించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. గోడౌన్ తనిఖీ చేస్తే బియ్యం లేని విషయం తెలిసిపోతుందని గ్రహించిన పేర్ని నాని.. తమ గోడౌన్ లో బియ్యం నిల్వలు తగ్గాయని.. దానికి ఎంత కట్టాలో చెప్తే కట్టేస్తానని లేఖ రాశారు.
పేర్ని నాని లేఖ రాసిన తర్వాత అధికారులు అక్కడికెళ్లి తనిఖీలు చేపట్టి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తంలో బియ్యం మాయమయ్యాయని తేల్చారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇంతలో తొలి దఫా రూ.1.72 కోట్లను జరిమానాగా చెల్లించేశారు పేర్ని నాని. మరోవైపు కేసు నమోదు కావడంతో పేర్ని నాని సహా భార్య, కుమారుడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ వచ్చే వరకూ అజ్ఞాతంలో ఉన్న పేర్ని జయసుధ.. బెయిల్ వచ్చాక విచారణకు హాజరయ్యారు. తమకు ఏమీ తెలీదని.. ఆరు నెలల కిందటే మానస్ తేజ్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడని.. అతను జాయిన్ అయ్యాకే బియ్యం మాయమైందని ఆమె వివరించారు.
అయితే జయసుధ స్టేట్ మెంట్ తప్పు అని FIR చెప్తోంది. బియ్యం అమ్మగా మానస్ తేజ్ అకౌంట్లో జమ అయిన మొత్తం ఎప్పటికప్పుడు పేర్ని నాని అకౌంట్ కు బదిలీ అయింది. బియ్యం ద్వారా కాకుండా మరే ఇతర రూపంలో ఈ మొత్తం సమకూరిందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి వాళ్ల దగ్గర సమాధానం లేదు. ఈ వ్యవహారంలో పేర్ని నాని ఫ్యామిలీ.. నెపాన్ని మేనేజర్ మానస్ తేజ్ పైకి నెట్టేసి తాము తప్పించుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే ఆర్థిక లావాదేవీలు మాత్రం వాళ్లను వదిలేలా లేవు.













