Perni Nani : పేర్ని నానీ.. నీతులు చెప్పే మీరే ఇలా చేస్తే ఎలా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నేతల్లో పేర్ని నాని ఒకరు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. వైఎస్ ఉన్నప్పుడు ఆ తర్వాత జగన్ (YS Jagan) వెంట నడుస్తూ వస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పేర్ని నాని (Perni Nani) పార్టీ వాయిస్ వినిపించడంలో ముందుండేవారు. మంచి మాటకారి కావడం, దేనినైనా తనకు అనుకూలంగా సమర్థించుకోవడంలో పేర్ని నాని దిట్ట. విపక్షాలకు కౌంటర్స్ ఇవ్వడంలో పేర్ని నానికి ప్రత్యేక శైలి ఉంది. అయితే ఇప్పుడు పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో ఆయన భార్యపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తను తప్పుకుని తన కుమారుడిని పోటీ చేయించారు. అయితే టీడీపీ హవా ముందు నెగ్గలేకపోయారు. అయినా పేర్ని నాని ఎక్కడా తగ్గలేదు. పార్టీ పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటూ వస్తున్నారు. పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు. పేర్ని నాని మాటలు విన్నవాళ్లెవరయినా తను తప్పు చేయడని.. అందుకే అంత గట్టిగా మాట్లాడుతుంటారని భావిస్తూ ఉంటారు. అయితే అది నిజం కాదని తాజా వార్తలను బట్టి అర్థమవుతోంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం (Machilipatnam) మండలం పొట్లపాలెంలో పేర్ని నాని భార్య పేర్ని జయసుధ (Perni Jayasudha) పేరిట గోడౌన్ ఉంది. ఇందులో రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తూ ఉంటారు. అలా నిల్వ చేసిన బియ్యంలో 187 టన్నులు మాయమైనట్లు తనిఖీల్లో తేలింది. ఈ బియ్యం ఎక్కడికెళ్లిందో.. ఏమైపోయిందో తెలీదు. బియ్యం మాయం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కేసు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయం గ్రహించిన పేర్ని నాని తన అనుకూల అధికారుల ద్వారా జరిమానా చెల్లించేలా స్కెచ్ వేశారు. మాయమైన బియ్యానికి రెట్టింపు ధర.. అంటే కోటి 72 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు నోటీసులు పంపించారు. ఈ మొత్తాన్ని రెండు దఫాలుగా పేర్ని నాని చెల్లించేశారు. ఈ మొత్తం చెల్లించేంత వరకూ పేర్ని నాని కుటుంబం గాయబ్ అయింది. సోమవారం జరిమానా పూర్తిగా చెల్లించిన తర్వాత పేర్ని నాని ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.
మాయమైన బియ్యానికి (PDS rice) జరిమానా చెల్లించేశా కాబట్టి తాను సచ్చీలుడినని చెప్పుకునేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ బియ్యం (Ration Rice) ఏమైపోయిందో మాత్రం పేర్ని నాని చెప్పట్లేదు. ప్రభుత్వం మారిన ఆరు నెలల్లోనే 187 టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో బియ్యం మాయమైందో.. ఎంత వెనకేసుకున్నారోననే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కాకినాడ పోర్టులో (Kakinada Port) పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం దందా పెద్ద ఎత్తున సాగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు పేర్ని నాని ఈ విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు. తప్పు చేశానని ఒప్పుకుని జరిమానా కూడా కట్టారు. దీన్ని బట్టి పేర్ని నాని తప్పు చేసినట్లు రుజువవుతోంది.













