ఇవాళే ఏపీకి పవన్.. ఇక వారాహి సందడే సందడి..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. 14 నుంచి ప్రారంభమయ్యే యాత్రకోసం జనసైనికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైంది. 11 నియోజకవర్గాల్లో సాగే ఈ యాత్ర అన్నవరంలో ప్రారంభమవుతుంది. భీమవరంలో ముగుస్తుంది. అయితే రెండ్రోజుల ముందే పవన్ కల్యాణ్ ఇవాళే ఏపీకి చేరుకుంటున్నారు. రెండోజులపాటు మంగళగిరి ప్రధాన కార్యాలయంలో పలు సమావేశాలు, కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. జనసేన శ్రేణులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర ప్రారంభమవుతుండడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళే ఆంధ్రప్రదేశ్ చేరుకుంటున్నారు. రేపు, ఎల్లుండి పలు కీలక కార్యక్రమాలను మంగళగిరి పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో ఏర్పాటు చేశారు. రేపు హెడ్ ఆఫీసులో ఒక భవన నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఎల్లుండి కార్యాలయ ఆవరణలో హోమం నిర్వహించబోతున్నారు. వారాహి యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ హోమం నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైన నేతలు ఈ హోమంలో పాల్గొనబోతున్నారు.
14న అన్నవరం నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. వారాహి వాహనానికి ప్రత్యేక పూజల అనంతరం యాత్ర మొదలవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 11 నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో రెండ్రోజుల పాటు యాత్ర ఉంటుంది. యాత్రలో ప్రజలతో మమేకం కావడంతో పాటు ప్రతి రోజూ ఒక సైట్ విజిట్ ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగించనున్నారు.
దాదాపు నెల రోజులపాటు సాగే ఈ యాత్ర ద్వారా ఎన్నికలకు పవన్ కల్యాణ్ శంఖారావం పూరించబోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈసారి బరిలో దిగబోతున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కూడా వైసీపీ నేతలకు కౌంటర్స్ ఇస్తూ ప్రధానంగా యాత్ర సాగిస్తారని తెలుస్తోంది. పొత్తులపైన కూడా స్థానిక నేతలకు క్లారిటి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. అయితే బీజేపీ నిర్ణయం కోసం ఇరు పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. బీజేపీ కలిసినా కలవకపోయినా ఈ రెండు మాత్రం కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి జనసేనాని చాలా కాలం తర్వాత రోడ్డుపైకి వస్తుండడంతో జనసైనికులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.













