మళ్లీ జనంలోకి పవన్ కల్యాణ్..! టీడీపీ, బీజేపీ కూడా జాయిన్ అవనున్నాయా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏపీ ప్రభుత్వం జైలుకు పంపడంతో టీడీపీ డీలా పడింది. దీంతో జనసేన యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు జనసేన ప్రకటించింది. అందుకోసం విస్తృతంగా జనంలోకి వెళ్లాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. టీడీపీని కూడా గట్టెక్కించాల్సిన బాధ్యత ఇప్పుడు పవన్ కల్యాణ్ పై పడిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుకోసం మరో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ జనంబాట పడుతున్నారు. విడతల వారీగా వారాహి యాత్ర చేస్తున్న ఆయన.. ఆదివారం నుంచి మరో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఉభయ గోదావరి జిల్లాలో రెండు విడతలు, విశాఖ జిల్లాలో మరో విడత వారాహి యాత్ర ఇప్పటికే పూర్తయింది. నాలుగో విడత వారాహి యాత్రకు ఆయన కృష్ణ జిల్లాను వేదికగా ఎంచుకున్నారు. సుమారు వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి చేరుకున్న పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.
టీడీపీ ఇబ్బందుల్లో ఉండడం, ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఇప్పటికే ప్రకటించడంతో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చింది. మిత్రపక్షంగా టీడీపీని కూడా ఆయన కలుపుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనసైనికులు కూడా అక్కడక్కడా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇకపై రెండు పార్టీలు కలసి పని చేస్తాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలోనే సమావేశమవుతుందన్నారు. అన్నిటికీ మించి పొత్తు సీట్లు, ఓట్ల కోసం కాదని.. రాష్ట్రాభివృద్ధి కోసమని నాదెండ్ల స్పష్టం చేశారు.
ఇక పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రను జనసేన సీరియస్ గా తీసుకుంది. వారాహి యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే జగన్ సర్కార్ ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని చెప్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయని జనసైనికులు చెప్తున్నారు. ఈసారి వారాహి యాత్రలో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రేదశ్ కోసమే తాము పని చేస్తున్నామని.. త్వరలో ప్రజాప్రభుత్వం రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.













