విశాఖలో పవన్ కల్యాణ్ స్ట్రాటజీ వర్కవుట్ అయిందా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ఇప్పుడు విశాఖ చుట్టూనే తిరుగుతోంది. అమరావతి రైతులు అరసవిల్లికి పాదయాత్ర మొదలు పెట్టడం.. దాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖను రాజధానిగా ప్రకటించాలంటూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు జేఏసీ ఏర్పాటు చేసినప్పటి నుంచి రచ్చ మొదలైంది. వికేంద్రీకరణకు మద్దతుగా 15వ తేదీన గర్జన నిర్వహించాలనుకోవడం.. అదే రోజు పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలనుకోవడం.. అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. జోరువానలోనూ గర్జన సక్సెస్ అయిందని ఒకవైపు వైసీపీ చెప్తుంటే.. వాళ్ల ఆశలపై పవన్ కల్యాణా నీళ్లు చల్లారని జనసైనికులు చెప్తున్నారు.
వికేంద్రీకరణకు మద్దతుగా తాము తలపెట్టిన గర్జన ద్వారా ఏపీ మొత్తానికి సంకేతాలు పంపాలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యూహరచన చేశారు. అందుకు తగ్గట్టే రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన నేతలను కూడా గర్జనకు ఆహ్వానించారు. మూడు రాజధానులకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల మద్దతూ ఉందని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. వేదికపై రోజా, కొడాలి నాని, వైవీ సుబ్బారెడ్డి తదితర నేతలు ఇదే విషయాన్ని వెల్లడించారు. తాము రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందినా, విశాఖకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. ఓ వైపు జోరు వానలో కూడా పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలు రూపొందించి వైజాగ్ ను రాజధానిగా ప్రకటించే వరకూ పోరోడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
జేఏసీ గర్జన అలా ముగిసిందో లేదో.. పవన్ కల్యాణ్ వైజాగ్ లో ల్యాండ్ అయ్యారు. అప్పటి నుంచి హడావుడి మొత్తం పవన్ చుట్టూనే తిరిగింది. గర్జన పూర్తిగా మరుగున పడిపోయింది. గర్జన ముగించుకుని ఎయిర్ పోర్టుకు బయలుదేరిన మంత్రులు, వైసీపీ నేతల వాహనాలపై కొందరు రాళ్లు రువ్వారు. ఇది జనసైనికుల పనేనని వైసీపీ నేతలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచారు. వాళ్లలో కొంతమందికి వెంటనే బెయిల్ వచ్చింది. మిగిలిన వాళ్లకోసం హైకోర్టులో పోరాడాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
వైజాగ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత నోవోటెల్ హోటల్ వరకూ ర్యాలీగా వెళ్లాలని పవన్ కల్యాణ్ భావించారు. అయితే పవన్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో జనసైన్యం ఎక్కడికక్కడ నిరసన తెలిపింది. ఎయిర్ పోర్ట్ నుంచి నోవోటెల హోటల్ కు పవన్ చేరుకోవడానికి 5 గంటలు పట్టిందంటే ఏ స్థాయిలో ర్యాలీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అడ్డుకోవడం.. జనసేన కార్యకర్తలు నిరసన తెలపడం.. లాంటి అంశాలతో విశాఖ మొత్తం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. పవన్ హోటల్ చేరుకున్నాక కూడా పోలీసులు పవన్ ను బయటకు రానివ్వలేదు. జనవామి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించినా.. ర్యాలీకి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో పవన్ హోటల్ లోనే ఉండిపోయారు. అక్కడి నుంచే ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. పవన్ ఎపిసోడ్ మొత్తాన్ని మీడియా కవర్ చేయడంతో గర్జన మొత్తం వెనక్కు వెళ్లిపోయింది. పవన్ కల్యాణ్ తమ గర్జనపై నీళ్లు చల్లారని వైసీపీ నేతలే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.













