14 నుంచి పవన్ కల్యాణ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్..?
పవన్ కల్యాణ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి దూకేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ఇంక ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినం. ఆ రోజు నుంచి పార్టీకోసం పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ దినోత్సవంలో ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు పవన్ కల్యాణ్.
14న బందరులో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అంతకు ముందు రెండ్రోజులపాటు పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరపబోతున్నారు. కాపుసేన నేత హరిరామ జోగయ్యతో పాటు జిల్లా నేతలతో జనసేనాని అభిప్రాయాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు, కాపుల సంక్షేమం కోసం అమలు చేయాల్సిన కార్యక్రమాలు, అధికార వైసీపీపై ఉద్యమ కార్యాచరణ, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు.. లాంటి అనేక అంశాలపై ఆయన అభిప్రాయ సేకరణ చేయనున్నారు.
ఎన్నికలకోసం ఇప్పటికే వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు పవన్. 14న వారాహిని తొలిసారి వినియోగించబోతున్నారాయన. మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి మచిలీపట్నం వరకూ ర్యాలీగా వెళ్లేలా పార్టీ శ్రేణలు ఏర్పాట్లు చేస్తున్నారు. వారాహిని రాష్ట్రంలో తిరగనివ్వబోమని వైసీపీ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో పవన్ వారాహిపైనే బందరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కూడా పవన్ ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ఇది ఇష్యూగా మారనుంది.
14న జరిగే పార్టీ ఆవిర్భావ సభలోనే వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. పొత్తులతో పాటు కాపులకోసం ఏం చేయబోతున్నారో కూడా వెల్లడించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ ఏడాది సినిమాలు కాస్త తగ్గించి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టడం ద్వారా జనసైనికుల్లో జోష్ నింపాలనుకుంటున్నారు. ఇప్పటికీ జనసేనకు గ్రౌండ్ లెవల్లో కేడర్ పూర్తిస్థాయిలో లేదనే చెప్పాలి. దీన్ని భర్తీ చేసేలే పవన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.













