పవన్ నోట సీఎం మాట..! అలా అడగ్గానే ఇలా చేసేస్తారా..?
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. పవన్ కల్యాణ్ పర్యటనకు మంచి స్పందన లభిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలో పవన్ యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతుందని ముందు నుంచీ ఊహించిందే. అన్నవరం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పిఠాపురం చేరుకుంది. పిఠాపురంలో శుక్రవారం పవన్ సభకు జనం కిక్కిరిసి పోయారు. వాళ్ల ఉత్సాహం చూసి పవన్ కల్యాణ్ కూడా తనదైన స్పీచ్ తో రెచ్చిపోయారు. వైసీపీ సర్కార్ పై సెటైర్లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తనకు సీఎం కావాలని ఉందని, తనకు ఆ అర్హత ఉందని చెప్పుకొచ్చారు. తనను సీఎం చేయాలని ప్రజలను వేడుకున్నారు.
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు దాటిపోయింది. ఇంతకాలం పవన్ కల్యాణ్ ఎప్పుడూ సీఎం పదవిపై ఈ స్థాయిలో మక్కువ చూపలేదు. ఎప్పుడు మాట్లాడినా తనకు అధికారంపై యావ లేదనే వారు. తను పాతికేళ్ల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, అధికారంపై తొందరేమీ లేదని చెప్పుకునే వారు. అయితే ఇది అనేక విమర్శలకు దారితీసింది. రాజకీయ పార్టీలేవైనా అధికారంలోకి రావాలని కోరుకుంటాయని, పవన్ కల్యాణ్ మాత్రం అధికారం అవసరం లేదని చెప్తున్నారేంటి అని పెదవి విరిచేవారు. ముఖ్యంగా వైసీపీ వాళ్లు దీనిపై సెటైర్లు వేసేవారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని.. ఆయన సీఎం అవడానికి కాదని విమర్శించేవాళ్లు.
దీంతో పవన్ కల్యాణ్ అలెర్ట్ అయినట్లున్నారు. ఇన్నాళ్లూ తనకు పదవిపై వ్యామోహం లేదన్న ఆయన.. ఇప్పుడు తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని పదేపదే చెప్పుకుంటున్నారు. తనను సీఎంను చేయాలని కోరుతున్నారు. సీఎం సీటు కోసం అవసరమైన సీట్లు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ అక్రమార్కుల అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. తమదైన రోజు వాళ్లందరినీ కింద కూర్చోబెడతానని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కు ఇన్నాళ్లకు రాజకీయ పార్టీ అసలు లక్ష్యం అర్థమైందని కొందరు చెప్పుకుంటున్నారు. పార్టీలేవైనా అధికారమే పరమావధిగా పని చేయాలి. అందుకోసం యుద్ధం చేయాలి.
అయితే పవన్ కోరగానే సీఎం సీటు వచ్చేయదు. ప్రజలు అనుకుంటేనే పవన్ సీఎం అవుతారు. అయితే ఇందుకు పకడ్బందీ వ్యూహం ఉండాలి. మెజారిటీ సీట్లు దక్కించుకోవాలంటే అందుకు తగ్గట్టు గట్టి అభ్యర్థులను నిలబెట్టాలి. ఏపీలో అధికారంలోకి రావాలంటే కనీసం 88 సీట్లు సాధించాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే అంత ఈజీ కాదు. వైసీపీ, టీడీపీలతో ఢీకొట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా పవన్ టీడీపీతో పొత్తుకు దాదాపు సిద్ధమైపోయారు. అలాంటప్పుడు తనను సీఎం చేయండి అని కోరడం కాస్త హాస్యాస్పదంగానే అనిపిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేనకు సీఎం సీటు ఎందుకిస్తారు? ఇంత చిన్న లాజిక్ పవన్ ఎలా మిస్ అయ్యారు?













