వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు..! పవన్ కల్యాణ్ టార్గెట్ రీచ్ అయ్యారా…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్లపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారి తీస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తో వాలంటీర్లు వీధుల్లోకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ వైసీపీ మద్దతుతో సాగుతున్నవే. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ కామెంట్స్ చేయడం వెనుక ఎంతో వ్యూహం ఉందని ఇప్పుడు అర్థమవుతోంది. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి కొన్ని అనుమానాలున్నాయి. అయితే ఈ వ్యవస్థ వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతుండడంతో ఎవరూ నోరెత్తే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తేనె తుట్టెను కదిపారని చెప్పొచ్చు.
వాలంటీర్లు ఉద్యోగులు కారు. కేవలం నెలకు 5వేల రూపాయల భృతి మాత్రమే తీసుకుంటారు. అయినా తమ పరిధిలోని 50 కుటుంబాలకు ఏం కావాలన్నా వాలంటీర్ల ద్వారా జరగాల్సిందే. వాలంటీర్ ప్రమేయం లేకుండా ఏ పనీ జరగదు. ఏ కార్యక్రమం అమలు కాదు. ఏ పథకమూ ఇంటికి చేరదు. వాలంటీర్ అనుకుంటే ఎస్.. లేదంటే నో..! వాలంటీర్లు గ్రామ సచివాలయానికి రిపోర్ట్ చేస్తారు. వీళ్లకు ట్యాబ్ ఉంటుంది. అందులో తమ పరిధిలోని అందరి ఇళ్ల సమాచారమూ నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ల పేర్లు, ఊర్లతో పాటు ఆదాయం, భూమి.. లాంటి సమస్త సమాచారం లభిస్తుంది. ఉద్యోగి కానీ వాలంటీర్ కు ఇలాంటి వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉండడం వల్ల అది దుర్వినియోగం అవుతోందనేది పవన్ కల్యాణ్ ఆరోపణ.
తొలిరోజు పవన్ కల్యాణ్ పొరపాటున ఆరోపణలు చేసి ఉండొచ్చని అనుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా వాలంటీర్లను టార్గెట్ గా చేసుకుని విమర్శలు కంటిన్యూ చేస్తున్నారాయన. దీంతో ఆయన ఈ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపేందుకే టార్గెట్ చేశారని అర్థమవుతోంది. ముఖ్యంగా వాలంటీర్లు సేకరించిన సమాచారం అధికారులతో పాటు స్థానిక వైసీపీ నేతలకు వెళ్తోందని.. వాళ్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని పవన్ చెప్తున్నారు. కొన్ని కుటుంబాలను బెదిరించి లొంగ దీసుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాక వాలంటీర్లు సేకరించిన సమాచారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఎందుకుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటి సమాచారాన్ని నానక్ రామ్ గూడలోని ఓ ఏజెన్సీ స్క్రూటినీ చేస్తోంది. ఎన్ని కుటుంబాలకు ఏఏ పథకం ద్వారా లబ్ది చేకూరుతోంది.. లాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందిస్తూ లైజనింగ్ చేస్తోంది.
వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరగాలనేది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. వాళ్లకు ఇచ్చే జీతం కూడా అంతంతమాత్రమే. వైసీపీ నేతలు వాలంటీర్లను చిన్నచూపు చూస్తున్నారు. తాము చెప్పినట్టు చేయకపోతే తీసేస్తాం అని బెదిరిస్తున్నారు. దీంతో వాళ్లు చెప్పినట్టే నడుచుకోవాల్సిన పరిస్థితి వాలంటీర్లది. అర్హులైన కుటుంబాలకు కూడా కొన్నిసార్లు పథకాలు అందించలేని దుస్థితి. ఎందుకంటే స్థానిక వైసీపీ నేత ఆమోదం తప్పనిసరి. లేకుంటే అది ముందుకు సాగదు. ప్రతి ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకే వాలంటీర్లకు భృతి ఇచ్చి నియమించుకున్నారనేది పవన్ ఆరోపణ. మొత్తానికి పవన్ లేవనెత్తిన అంశాల ద్వారా ఇప్పుడు వాలంటీర్లపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయినట్టే.













