బీజేపీ గుండెల్లో పవన్ బాంబు పేల్చారా..?
“వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతాం.. ఈ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా..” అంటూ సత్తెనపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కారని.., పూటకోమాట మాట్లాడుతుంటారని.. ఆయన మాటల్లో గందరగోళం ఉంటుందని.. ఇలా ఎన్నో కామెంట్స్ పవన్ కల్యాణ్ పై ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పవన్ కల్యాణ్ కాస్త క్లారిటీతో ఉన్నట్టు కనిపించారు. గతంలో ఎప్పుడో ఈ మాట చెప్పారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని నిన్న మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఒక క్లారిటీ వచ్చినట్లయింది.
చాలాకాలం కిందట పవన్ కల్యాణ్ ఈసారి వైసీపీని గద్దె దించబోతున్నామని … మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకమేనని ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆయన టీడీపీతో కలవడం ఖాయమని అందరూ భావించారు. అయితే.. విశాఖ గర్జన తర్వాత పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడం, ఆ తర్వాత మంగళగిరిలో పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి కలవడంతో దానిపై మరింత నమ్మకం కలిగింది. అదే రోజు పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ చెలరేగిపోవడం అందరికీ తెలిసిన విషయమే. దీంతో టీడీపీ – జనసేన ఈసారి కలిసి పోటీ చేయడం ఖాయమని చాలా మంది కన్ఫామ్ చేసుకున్నారు.
అయితే విశాఖలో ప్రధాని మోదీ పర్యటన తర్వాత సీన్ మారింది. ఆ రోజు ప్రధానిని కలవాలంటూ పీఎంఓ నుంచి పవన్ కల్యాణ్ కు సమాచారం రావడం.. హుటాహుటిన పవన్ వెళ్లి ప్రధానిని కలవడం చకచకా జరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ పవన్ కల్యాణ్ కు దిశానిర్దేశం చేశారని.. దాని ప్రకారం బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని ఊహాగానాలు వినిపించాయి. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి సేవలను వాడుకోవడం, ఆయనకు కేంద్రంలో ఏదైనా మంచి పదవి ఇవ్వడం.. అదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించి ఎన్నికలకు వెళ్లడం.. లాంటి అనే అంశాలను ప్రధాని పవన్ కు వివరించినట్లు వార్తలు వినిపించాయి. ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ తీరులో కూడా కాస్త మార్పు కనిపించింది. అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు.
అయితే ఇప్పుడు సత్తెనపల్లిలో మీటింగ్ తర్వాత వైసీపీపై పవన్ పిచ్చ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలు తనను పదే పదే టార్గెట్ చేస్తుండడంతో ఎలాగైనా వైసీపీని దించాలనే పట్టుదల ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని పవన్ భావిస్తున్నట్టు అర్థమవుతోంది. అలా జరగాలంటే పవన్ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం టీడీపీతో కలిసి వెళ్లడమే. బీజేపీతో కలిసి వెళ్తే ఆయన కోరిక నెరవేరే ఛాన్సే లేదు. అందుకే వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో కలిసి వెళ్లడం మినహా మరో మార్గం లేదని బీజేపీకి జనసేనాని సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీయే.! మరి బీజేపీ ఎలా ముందుకెళ్తుంది.. ఎవరితో కలిసి వెళ్తుందనేది వేచి చూడాలి.













