శరవేగంగా మారిపోతున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు..!
నెల్లూరు జిల్లా పాలిటిక్స్ కొంతకాలంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే ఆ పార్టీ గీత దాటారు. పార్టీ మాట కాదని అధినేతనే ధిక్కరించారు. ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. దీంతో అధికార వైసీపీ షాక్ కు గురైంది. వైసీపీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నా.. ఏప్పుడు చేరతారనేదానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుండడంతో ఈ నేతలు చేరతారనే ప్రచారం జోరందుకుంది.
నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందే కోటంరెడ్డి, ఆనం పార్టీ అధిష్టానంతో విభేదించడం మొదలు పెట్టారు. అడపాదడపా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే పార్టీని టార్గెట్ చేశారు. దీంతో వీళ్లిద్దరూ పార్టీని వీడడం ఖాయమనే నిర్ణయానకి వచ్చంది వైసీపీ అధిష్టానం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 4 ఓట్లు టీడీపీకి పడడం, ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో మరో ఇద్దరు కూడా టీడీపీకి ఓటేసినట్లు వైసీపీ అనుమానించింది. చివరకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీ మాటను జవదాటినట్లు గుర్తించింది.
కోటంరెడ్డి, ఆనం, మేకపాటి.. ముగ్గురూ నెల్లూరు జిల్లాకు చెందిన నేతలే. ముగ్గురిదీ జగన్ సామాజిక వర్గమే. అయినా పార్టీని ధిక్కరించడం పెద్ద సంచలనం సృష్టించింది. అయితే వీళ్లంతా వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఖాయమైంది. అయితే ఎప్పుడు చేరతారో క్లారిటీ మాత్రం రెండు వైపుల నుంచి రాలేదు. కానీ ఇప్పుడు కాస్త కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది. శుక్రవారం ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. మరోవైపు నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ భేటీ అయ్యారు. ఇవాళ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 13న నెల్లూరు జిల్లాలోకి ప్రవేశంచబోతోంది. ఈ క్రమంలో నేతలు టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇక ఆలస్యం చేయాల్సిన అవసరం లేదనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అయితే వీళ్లు ముగ్గురు ఇప్పటికిప్పుడు పార్టీలో చేరకుండా తమ అనుచరులను లోకేశ్ పాదయాత్రలో చేర్చించి ఎన్నికల ముందు వీళ్లు చేరేలా ప్రణాళిక రూపొందించారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడంపైనే వీళ్లంతా సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.













