‘యువగళం’ పేరుతో లోకేశ్ పాదయాత్ర..! కొత్త తరానికి అవకాశం ఇవ్వబోతున్నారా..?
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్, విధివిధానాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర చేపట్టబోతున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. లోకేశ్ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టింది పార్టీ. పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టినా యువతతో పాటు మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటూ యాత్ర ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కోటిన్నరకు పైగా నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఉందని అంచనాకు వచ్చిన టీడీపీ.. వారిపైనే ఎక్కువగా ఫోకస్ చేసేలా లోకేశ్ యాత్రను రూపొందించినట్లు అర్థమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ తపిస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలనూ సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల టూర్లో బిజీబిజీగా ఉంటున్నారు. ప్రతి నెలా రెండు, మూడు జిల్లాల్లో పర్యటిస్తూ శ్రేణులను యాక్టివ్ గా ఉంచుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకూ శ్రేణులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే లోకేశ్ తో పాదయాత్రకు రూపకల్పన చేశారు. లోకేశ్ పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఒక వేదిక దొరుకుతుందని భావిస్తున్నారు. అంతేకాక.. లోకేశ్ ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావడం ద్వారా ప్రజలకు లోకేశ్ మరింత చేరువ అవుతాడని.. అప్పడు అతనిపై ఉన్న అపవాదులు తొలగిపోతాయని చంద్రబాబు నమ్ముతున్నారు.
లోకేశ్ పాదయాత్ర జనవరి 27న కుప్పంలో ప్రారంభమవుతుంది. ఏడాదికి పైగా యాత్ర కొనసాగుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 400 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 4000 కిలోమీటర్లు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో వందకు పైగా నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజులపాటు యాత్ర సాగనుంది. అంతేకాక పాదయాత్ర సాగే ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. 2024 ఉగాది నాటికి ఇచ్చాపురంలో లోకేశ్ పాదయాత్ర ముగుస్తుంది. అప్పడు ఎన్నికలు సమీపిస్తాయని అంచనా వేస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర ద్వారా యువతకు చేరువయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
పదేళ్ల క్రితం 2012 అక్టోబర్ 2న చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్ర 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడింది. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా కచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని టీడీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. యువతను పెద్దఎత్తున భాగస్వాములను చేయడం ద్వారా వారికి చేరువ కావాలని టీడీపీ భావిస్తోంది. నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తటస్థులను, కొత్తవారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు యువతకు పట్టం కట్టడం ద్వారా కొత్త జనరేషన్ ను రాజకీయాలకు పరిచయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఉత్సాహవంతులెవరైనా యువగళం పాదయాత్రలో భాగస్వాములు కావచ్చని టీడీపీ ప్రకటించింది. ఉత్సాహవంతులు 9686296862 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి తమ పేరు నమోదు చేసుకోవచ్చని సూచించింది. మరి లోకేశ్ పాదయాత్ర పార్టీకి ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.













