Names Change : ఏపీలో మళ్లీ పేర్ల గోల..!! అధికారం మారినప్పుడల్లా ఇదే రాజకీయం..!!
ఆంధ్రప్రదేశ్ (AP)లో మళ్లీ పేర్ల రాజకీయం (Name Politics) మొదలైంది. అధికారంలోకి రాగానే ఆయా రాజకీయ పార్టీలు తమకు నచ్చిన వాళ్ల పేర్లను వివిధ సంస్థలు, ఊళ్లకు పెట్టుకోవడం అలవాటైపోయింది. అంతవరకూ ఓకే.. కానీ అప్పటికే ఉన్న వేరే వాళ్ల పేర్లను తొలగించి తమ కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్లు ఆ పేర్లలో మార్పులు, చేర్పులు చేస్తే రచ్చ మొదలవుతోంది. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. నాడు వైసీపీ (YSP) అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పేర్లను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తొలగిస్తోంది. దీంతో వైసీపీ రచ్చ చేస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ (YS Jagan) రాష్ట్రంలో పలు సంస్థలు, యూనివర్సిటీలు, మున్సిపాలిటీలు.. ఇలా చెప్పుకుంటో ఎన్నింటికో వైఎస్సార్ పేరుతో పాటు తన పేరును పెట్టుకున్నారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డికి వాటితో ఏమాత్రం సంబంధం లేకపోయినా పెట్టేశారు. 2003లో విశాఖపట్నంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (VDMC), బీసీసీఐ (BCCI) సహకారంలో స్టేడియం (Visakha Stadium) కట్టింది. దీనికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. అయినా జగన్ దానికి వైఎస్సార్-ఏసీఏ-వీడీఎంసీ స్టేడియం (YSR Stadium) అనే పేరు పెట్టారు.
విజయవాడలో ఆరోగ్యవర్శిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. అది ఎప్పటి నుంచో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా (NTR Health University) ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University) అని మార్చేశారు. అప్పటికే రాష్ట్రంలో వైఎస్సార్ హార్టీ కల్చరల్ యూనివర్సిటీ (YSR Horticulture University ) ఉంది. కడపలో వైఎస్సార్ పేరిట ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కూడా ఉంది. విజయవాడ శివారులోని తాడిగడప మున్సిపాలిటీకీ వైఎస్సార్ (YSR Tadigadapa) పేరు పెట్టారు. కడప జిల్లాకు వైఎస్సార్ జిల్లా (YSR District) అని పెట్టారు. కడప జిల్లాతో తప్ప మిగిలిన వాటికి, వైఎస్సార్ కు ఎలాంటి సంబంధం లేదు. అయినా జగన్ తన తండ్రి కాబట్టి వాటికి వైఎస్సార్ (YSR Kadapa District) పేరు పెట్టేశారు.
జగన్ ఓడిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయా పేర్లను మార్చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేసింది. తాడిగడప నుంచి వైఎస్సార్ పేరు తొలగించింది. వైఎస్సార్ జిల్లాకు కడపను జోడించింది. ఆయన పేరు తొలగించకుండా వైఎస్సార్ కడప జిల్లాగా మార్చింది. విశాఖ క్రికెట్ స్టేడియం పేరును వాస్తవానికి ప్రభుత్వం మార్చలేదు. ఇప్పటికీ స్టేడియం ఎంట్రన్స్ లో, నేమ్ బోర్డులో వైఎస్సార్ పేరు ఉంది. టికెట్ బుకింగ్స్ లో కూడా అలాగే ఉంది. స్టేడియం పైన మాత్రం వైఎస్సార్ అక్షరాలను తొలగించారు. ఇది ACA పరిధిలోని అంశం. ప్రభుత్వానికి సంబంధించింది కాదు.
అయినా వైసీపీ మాత్రం ఈ పేరు తొలగించడాన్ని తట్టుకోలేకపోతోంది. స్టేడియం ఎదుట వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. పేరును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ప్రజల ఆస్తులకు తమ కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకోవడమే సిగ్గుచేటు. అన్ని పార్టీలూ ఈ విషయంలో కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బాగుంటుంది. లేకుంటే రేపు ఈ ప్రభుత్వం పోయి వాళ్లు వస్తే మళ్లీ పేర్లు మార్చేసుకుంటారు. అందుకే కుటుంబసభ్యుల పేర్లు కాకుండా వైతాళికుల పేర్లు పెట్టుకుంటే మంచిది. అప్పడు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.













