జగన్ ముందు నేడు మైలవరం పంచాయితీ! మరో షాక్ తప్పదా?
వైసీపీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతూనే ఉన్నాయి. రోజుకో చోట ఇలాంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరులో అసంతృప్తి సెగలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇన్నాళ్లూ చూసాం. ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేమని తేల్చి చెప్పారు. అలాగే కృష్ణా జిల్లా మైలవరం వైసీపీలో ఎంతోకాలంగా విభేదాలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మైలవరం పంచాయితీ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది.
మైలవరంలో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావును ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో జగన్.. సమర్థుడైన నాయకుడికోసం వెదికారు. 2019లో వసంత కృష్ణ ప్రసాద్ రూపంలో ఓ నాయకుడు దొరికాడు. వసంత కృష్ణ ప్రసాద్ కూడా దేవినేనిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కష్టపడ్డారు. అప్పటి ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు అయిన నియోజకవర్గాల్లో మైలవరం ముందంజలో ఉందనే ప్రచారం ఉంది. చివరకు వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ కు మంత్రి పదవి గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ కు మంత్రి పదవి దక్కలేదు. ఆయన కూడా మంత్రి పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
వసంత కృష్ణ ప్రసాద్ గెలిచినప్పటి నుంచి మైలవరంలోనే తిష్టవేసి పార్టీకోసం పనిచేస్తూ వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో జోగి రమేశ్ కు కేబినెట్లో స్థానం దక్కింది. జోగి రమేశ్ మైలవరం పరిధిలోని ఇబ్రహీంపట్నం వాసి. అప్పటి నుంచి ఆయన కన్ను మైలవరంపై పడిందని చెప్తుంటారు. పైగా మంత్రిగా ఉండడంతో నియోజకవర్గంలోని అధికారులు కూడా ఆయన చెప్పినట్లే నడుచుకుంటూ వచ్చారు. దీంతో ఎమ్మెల్యే వీక్ అయిపోయారు. వసంత కృష్ణ ప్రసాద్ మాటను పట్టించుకోవడం వదిలేశారు. పైగా స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండానే మంత్రి కార్యక్రమాలు చేపడుతుండడం ఆగ్రహం కలిగించింది.
ఈ వ్యవహారాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు వసంత కృష్ణ ప్రసాద్. సలహాదారుడు సజ్జల నేతృత్వంలో వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలించలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సజ్జల ముందే ఇరువర్గాలు బాహాబాహీ తలపడే స్థాయికి పరిస్థితి వెళ్లింది. దీంతో ఇవాళ సీఎం జగన్ వద్దకు వెళ్లిందీ పంచాయితీ. జగన్ వీరి మధ్య సయోధ్య కుదుర్చుతారా.. లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కమ్మ వర్గీయులు వసంత కృష్ణ ప్రసాద్ పై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వసంత కుటుంబం కూడా వైసీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కాబట్టి ఇదే కంటిన్యూ అయితే త్వరలోనే మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.













