ముద్రగడతో వైసీపీ కీలక నేతకు చెక్..! జనసేన భారీ స్కెచ్..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు. అప్పుడే పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా మారిపోయాయి. ఎక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలి.. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ఎవరు సరైన అభ్యర్థి.. లాంటి అంశాలన్నీ బేరీజు వేసుకుంటున్నాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు ఈసారి టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీలో సీట్లు దక్కని పలువురు నేతలు ఇప్పుడు టీడీపీ – జనసేన వైపు చూస్తున్నారు. ఇదే కోవలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఉన్నారు.
ముద్రగడ పద్మనాభాన్ని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ ప్లాన్ వేసింది. పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టాలంటే ముద్రగడ లాంటి నేత అవసరమని భావించింది. ఈ మేరకు బేరసారాలు చేపట్టింది. అయితే ముద్రగడ కోరికలు విన్న వైసీపీ షాక్ తినింది. ఆయన మూడు ఎమ్మెల్యే సీట్లు అడిగారని టాక్. ఆయన కోరికలు నెరవేర్చలేమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ కిమ్మనకుండా ఉండిపోయింది. వైసీపీ తీరు నచ్చని ముద్రగడ పద్మనాభం టీడీపీ – జనసేన వైపు చూశారు. ఆ రెండు పార్టీల నేతలు వెళ్లి ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు.
టీడీపీ, జనసేనల్లో ఏ పార్టీలో చేరినా తమకు అభ్యంతరం లేదని రెండు పార్టీల నేతలు చెప్పారు. దీంతో ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే పవన్ కల్యాణ్ కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాత ముద్రగడ జనసేన కండువా కప్పుకోనున్నారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ముద్రగడ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. లేదంటే అక్కడి నుంచి ఆయన కుమారుడిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
అయితే జనసేన ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభాన్ని కాకినాడ సిటీ నుంచి బరిలోకి దింపాలనుకుంటోంది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టాలంటే ముద్రగడను బరిలోకి దింపడమే మేలని భావిస్తోంది. ద్వారంపూడితో ముద్రగడకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే కాకినాడ సిటీలో కాపులు, మత్స్యకారులు ఎక్కువ. ప్రస్తుతం టీడీపీ సిటీ కోఆర్డినేటర్ గా మత్స్యకార వర్గానికి చెందిన వనమాడి కొండబాబు ఉన్నారు. దీంతో ముద్రగడకు మత్స్యకారుల మద్దతు లభిస్తుంది. కాపులు, మత్స్యకారులు కలిసి ద్వారంపూడికి చెక్ పెడతారని, ముద్రగడను గెలిపిస్తారని జనసేన అంచనా వేస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.













