మోదీ వైజాగ్ టూర్కు సర్వం సిద్ధం..! అజెండాలో లేని రాజధాని అంశం..!
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 11వ తేదీ రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకోనున్నారు. అదే రోజు ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేస్తారు. అనంతరం 12వ తేదీ ఉదయం 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే బహిరంగసభలో మోదీ పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మోదీ రోడ్ షో, బహిరంగసభ జరిగే ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్ జల్లెడ పడుతోంది. అయితే మోదీ పర్యటన రాజకీయ రంగు పులుముకుంది.
ప్రధాని మోదీ పర్యటనను దిగ్విజయం చేసేందుకు వైసీపీ అగ్రనాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రధాని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటనను పార్టీలకతీతంగా దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. విశాఖను రాజధానిగా చేసేందుకు వైసీపీ తహతహలాడుతోంది. ఏపీలో అత్యంత అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం. దీన్ని రాజధానిగా మార్చేందుకు పదివేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని వైసీపీ నేతలు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు విశాఖకు ప్రధాని మోదీ వస్తుండడంతో రాజధానిగా విశాఖకు కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర పడినట్లేనని వైసీపీ భావిస్తోంది. అందుకే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టుదలతో ఉంది.
అయితే మోదీ టూర్ నేపథ్యంలో అధికార వైసీపీపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతల భూదందాపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అంతేకాక మూడు రాజధానుల అంశంపై మోదీ అభిప్రాయం చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక.. పోలవరం, విభజన సమస్యలు, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై ప్రధాని మోదీతో ప్రకటన ఇప్పించాలని వైసీపీని కోరుతున్నాయి. అలాగే రైల్వే జోన్ అంశం ఎంతోకాలంగా పెండింగ్ లో ఉందని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. తదితర అంశాలపై కూడా ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు.. బీజేపీ కూడా ప్రధాని మోదీ టూర్ పై స్పందించింది. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరింది. మూడు రాజధానుల అంశంపై మోదీ పర్యటన అజెండాలో లోదని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్.నరసింహా రావు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల శంకుస్థాపనలకే పరిమితమని తేల్చి చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలేవీ లేవని క్లారిటీ ఇచ్చారు. రైల్వే జోన్ ను ఇప్పటికే ప్రకటించామని.. దానిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. పవన్ కల్యాణ్ కు ఆహ్వానం ఉంటుందా.. అనే దానిపైన కూడా జీవీఎల్ స్పందించారు. దీనిపై పీఎంఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
అయితే టీడీపీ, జనసేన నేతలను ప్రధాని మోదీని కలవనీయకుండా షెడ్యూల్ ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కానుండడంతో ఇక్కడి విపక్షాల నేతలను ఆహ్వానించేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయింది. ఒకవేళ తమకు అవకాశం వస్తే వైసీపీ సర్కార్ పై ఫిర్యాదులు చేసేందుకు టీడీపీ, జనసేన సిద్ధమైంది. కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది.













