రాయలసీమలో ముగుస్తున్న యువగళం పాదయాత్ర..! లోకేశ్ ఫెయిలయ్యారా.. సక్సెస్ అయ్యారా..?
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 120 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ 1500 కిలోమీటర్లకు నడిచారు లోకేశ్. కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర రాయలసీమ జిల్లాల్లో ఇప్పటివరకూ కొనసాగింది. రెండు మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టబోతోంది. దీంతో రాయలసీమలో నారా లోకేశ్ పాదయాత్ర ఏ మేరకు ప్రభావం చూపించింది. కేడర్లో ఎలాంటి స్ఫూర్తి నింపింది.. అనే దానిపై టీడీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. అయితే రాయలసీమ జిల్లాల్లో నిస్తేజంగా ఉన్న కేడర్లో జోష్ తీసుకురావడంలో నారా లోకేశ్ సక్సెస్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు.
కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చాలా రోజులపాటు నిస్తేజంగానే సాగింది. కేడర్ పెద్దగా పాల్గొనలేదు. అయితే లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించేందుకు వైసీపీ అక్కడక్కడా కవ్వింపు చర్యలకు దిగింది. దీంతో టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యేందుకు అవకాశం కలిగింది. అయితే పాదయాత్రలో పెద్దగా జనం లేకపోవడం అనేక విమర్శలకు తావిచ్చింది. పాదయాత్ర ఫెయిల్ అనే ముద్ర వేసేశారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో కూడా పాదయాత్రలో పెద్దగా మార్పులు లేవు. అలాగే సా…గుతూ వచ్చింది. అయితే అనంతపురం జిల్లాలో వైసీపీ మరింత ఎక్కువగా కవ్వింపు చర్యలకు దిగడంతో టీడీపీ కేడర్ కూడా తిప్పికొట్టింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రావడంతో టీడీపీలో జోష్ వచ్చేసింది. ఇప్పటి నుంచి టీడీపీ నేతలు ఎక్కువగా హాజరయ్యారు.
కర్నూలులోకి ఎంటరైన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. యాత్రకు జోష్ రావడం, ఎమ్మెల్సీ ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో టీడీపీ కేడర్లో నమ్మకం కలిగింది. దీంతో వైసీపీని లెక్కచేయకుండా లోకేశ్ పాదయాత్రలో పాల్గొనేందుకు కేడర్ ఉత్సాహం చూపించింది. ఇక ఆళ్లగడ్డ, నంద్యాలలో అంతర్గత విభేదాల వల్ల పార్టీకి కాస్త డ్యామేజ్ కలిగినా కేడర్ మాత్రం కదలివచ్చింది. దీంతో లోకేశ్ కూడా ఉత్సాహంగా యాత్ర కొనసాగించారు. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. వైసీపీపై ధైర్యంగా పోరాడాలని, తాను అన్నీ చూసుకుంటానని భరోసా ఇచ్చారు. దీంతో కర్నూలు నేతల్లో ఉత్సాహం వెల్లివిరిస్తోంది.
కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇది వైసీపీ కంచుకోట. జగన్ సొంత జిల్లా. ఇక్కడ యాత్ర ఓ మోస్తరుగా సాగినా సక్సెస్ అయినట్టే అనుకున్నారు. అయితే అనుకున్నదాని కంటే కడప జిల్లాలో లోకేష్ యాత్ర సక్సెస్ అయింది. వైసీపీ కంచుకోటలైన జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి నియోజకవర్గాల్లో జనం పెద్దఎత్తున తరలివచ్చారు. భారీగా జనాన్ని రప్పించడంలో ఆయా నియోజకవర్గాల నేతలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. గత మూడేళ్లుగా అస్సలు బయటకు రాని నేతలు సైతం ఇప్పుడు తరలివచ్చారు. ఇదంతా లోకేశ్ పాదయాత్ర వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు.
లోకేశ్ పాదయాత్ర ఈ వారంలోనే నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. దాదాపు 120 రోజులకు పైగా రాయలసీమలో జరిగిన పాదయాత్ర ద్వారా కేడర్ ను బలోపేతం చేయడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. వైసీపీ కొన్ని స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గత ఎన్నికల్లో చిత్తూరులో ఒకచోట, అనంతపురం జిల్లాలో 2 చోట్ల టీడీపీ గెలిచింది. ఈసారి మరిన్ని సీట్లు ఈ రెండు జిల్లాలో వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరిగిందనే చెప్పొచ్చు. లోకేశ్ నింపిన స్ఫూర్తితో ఎన్నికల వరకూ ఇలాగే పనిచేస్తే టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.













