లోకేశ్ పాదయాత్ర సాఫీగా సాగేనా..?
లోకేశ్ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లోకేశ్ యాత్రను విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే ఫీలింగ్ తో ఉంది టీడీపీ. అందుకే యువనేత యువగళం యాత్రను అత్యధిక ప్రయారిటీగా తీసుకుంది. లోకేశ్ యాత్ర కోసం పార్టీ కేడర్ అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. కొంతకాలంగా తీవ్ర నిరాశనిస్పృహల్లో ఉండిపోయిన టీడీపీలో లోకేశ్ యువగళం కచ్చితంగా జోష్ తీసుకువస్తుందని పార్టీ భావిస్తోంది. అయితే లోకేశ్ పాదయాత్ర సాఫీగా సాగుతుందా.. అనే అనుమానం కలుగుతోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి.
ఈ నెల 27 న కుప్పం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రోజువారీ షెడ్యూల్ ను ఇప్పటికే ఖరారు చేశారు. మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా లోకేశ్ రోడ్ మ్యాప్ రెడీ చేశారు. ఏవైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే తప్ప.. యాత్ర సాఫీగా సాగిపోయేలా షెడ్యూల్ రెడీ చేశారు. ముఖ్యమైన పర్వదినాలు మినహా అన్ని రోజుల్లో లోకేశ్ యాత్ర సాగనుంది. లోకేశ్ యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచేవారికోసం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేశారు. నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పేర్లు రిజిస్టర్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. లోకేశ్ పాదయాత్రకోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. యాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చేందుకు ఈ కాల్ సెంటర్ పనిచేయనుంది. యువగళం పాదయాత్రకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా చిటికెలో అందించేందుకు ఈ సెంటర్ పనిచేస్తుందని పార్టీ వెల్లడించింది.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, ఇరుకైన ప్రదేశాల్లో బహిరంగసభలను ప్రభుత్వం నిషేధించింది. ఇందుకోసం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై తాము జోక్యం చేసుకోలేమని.. హైకోర్టే దీనిపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయినా.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఇప్పటికే డీజీపీ మొదలు ఆయా జిల్లాల పోలీస్ యంత్రాంగానికి టీడీపీ లేఖలు రాసింది. అయితే ఇప్పటివరకూ అటు ప్రభుత్వం నుంచి కానీ, పోలీసు డిపార్ట్ మెంట్ నుంచి కానీ రిప్లై రాలేదు. సమయం దగ్గర పడుతోంది.. కానీ అనుమతిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణులు కాస్త ఆవేదనతో ఉన్నాయి.
అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ స్పష్టం చేసింది. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తెచ్చిందని ఆరోపిస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆటంకాలు సృష్టించి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా.. అని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని మండిపడుతోంది. గతంలో పాదయాత్ర చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదంటూ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ బయటపెడుతోంది. అందుకే పాదయాత్రపై వెనకడుగు వేయకూడదని.. కచ్చితంగా నిర్వహించితీరాలని పట్టుదలతో ఉంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, స్పందించకపోయినా న్యాయస్థానాలను ఆశ్రయించాలని టీడీపీ ప్రత్యామ్నాయ ప్లాన్ రెడీ చేసుకుంది.













