Kolikapudi – Venigandla : కొలికపూడి సరే.. మరి వెనిగండ్ల పరిస్థితి ఏంటి..?
తెలుగుదేశం చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా గీత దాటి ప్రవర్తిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం ఏమాత్రం వెనకాడదనే పేరుంది. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు (Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao) వ్యవహారం టీడీపీకి (TDP) పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన పలుమార్లు పార్టీ గీత దాటి వ్యవహరించారు. పలుమార్లు పార్టీ పెద్దలు హెచ్చరించినా ఆయన తీరు మారలేదు. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైందనే టాక్ నడుస్తోంది. మరి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Gudivada MLA Venigandla Ramu) పైన కూడా చర్యలుంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటారు. ఈ మనస్తత్వం ఆయనకు అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య కనిపించినా అధికారులకు చెప్పకుండా ఆయనే వాలిపోతున్నారు. అక్కడ గొడవకు కారణమవుతున్నారు. దీంతో ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన తీరు నచ్చక ఓ టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా వైసీపీ మహిళా నేత ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇలాంటివన్నీ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. అందుకే ఆయన్ను క్రమశిక్షణా సంఘం పిలిపించి వివరణ తీసుకుంది.
నియోజకవర్గంలో టీడీపీ నేతలతో కూడా కొలికపూడి కయ్యానికి కాలు దువ్వతున్నారనే టాక్ ఉంది. అంతేకాదు స్థానిక విలేకరులు కూడా కొలికపూడిపై నేరుగా చంద్రబాబుకే (Chandrababu) ఫిర్యాదు చేశారు. పైగా తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర కులాలపై నోరు జారుతున్నారు. తాజాగా కమ్మ కులంపై (Kamma Caste) ఆయన మాట్లాడిన మాటలు సంచలనం కలిగించాయి. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం అయినా అక్కడ అన్ని కులాల మధ్య సత్సంబంధాలున్నాయి. కానీ కొలికపూడి వచ్చిన తర్వాత కులాల మధ్య చిచ్చు రాజుకుంటోంది. దీంతో ఆయనపై చర్యలకే క్రమశిక్షణా సంఘం సిఫారసు చేసినట్లు సమాచారం. దావోస్ నుంచి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు ఖాయమని తెలుస్తోంది.
అయితే కొలికపూడి విషయాన్ని పక్కన పెడితే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా పార్టీ గీత దాటుతున్నారని పలువురు నేతలు ఎత్తి చూపిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) కస్టోడియల్ టార్చర్ (Custodial Torture) కేసులో కామేపల్లి తులసిబాబు (Kamepalli Tulasi Babu) నిందితుడిగా ఉన్నారు. అయితే తులసిబాబుకు అండగా నిలుస్తన్నారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పోలీస్ ఉన్నతాధికారి సునీల్ కుమార్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబుతో వెనిగండ్ల రాము చట్టాపట్టాలు వేసుకుని తిరగడాన్ని పార్టీ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొలికపూడి లాగే వెనిగండ్ల రాము పైన కూడా పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా అని ఆరా తీస్తున్నారు. కొలికపూడికి ఓ న్యాయం, వెనిగండ్లకు మరో న్యాయం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు.













