కమలం గూటికి కిరణ్ కుమార్ రెడ్డి.. ఎవరితో ఎవరికి లాభం?
ఊహించినట్లే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి సమర్థుడైన నాయకుడని, ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా వాడుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కమలం గూటికి చేరడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డ ఆయన బీజేపీలో ఎలా మనుగడ సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడింది. నల్లారి కుటుంబం చిత్తూరు జిల్లాలో ఎంతో పేరొందింది. 1952 నుంచి నల్లారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ చరిత్ర వాళ్లది. ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రి కాకుండానే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రికార్డ్ కిరణ్ కుమార్ రెడ్డిదే. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ఉపాధి కూడా లేకుండా గడపాల్సి వచ్చింది.
రాష్ట్ర విభజనను చివరి వరకూ వ్యతిరేకించారు కిరణ్ కుమార్ రెడ్డి. చివరి బంతి వరకూ వెయిట్ చేస్తానని చెప్పి సమైక్యవాదులను ఊరించిన కిరణ్.. చివరకు చేతులెత్తేయాల్సి వచ్చింది. విభజనపై అధిష్టానాన్ని ధిక్కరించి మరీ పోరాడారు. అయితే విభజనకే సోనియా మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. మధ్యలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదు.
కాంగ్రెస్ వాదిగా బలమైన ముద్ర వేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి ఆయన్ను వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు 9 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా తనకంటూ ప్రత్యేక వర్గం కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. ఆయన పిలుపునిస్తే వచ్చి వాలిపోయే లీడర్లు లేరు. రెడ్డి సామాజికవర్గం కూడా ఆయన్ను పెద్దగా ఓన్ చేసుకోదు. మరి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీకి ఏమేరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి.













