కేశినేని నాని పయనం ఎటు..?
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా రాజకీయం ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అక్కడ ఏవో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. నేతలు గోడ దూకడమో.. లేకుంటే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడమో.. లేదంటే అనూహ్యంగా కొత్త ముఖాలు తెరపైకి రావడమో.. లాంటి అనేక పరిణామాలు విజయవాడ కేంద్రంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి అలాంటి పరిణామాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఉంటారు.. ఎక్కడి నుంచి బరిలో దిగుతారు.. లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వ్యాపారవేత్త కేశినేని నాని. అయితే ఆ పార్టీలో ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు. వెంటనే టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ తరపున విజయవాడ పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాలకోసం తన వ్యాపారాన్ని సైతం మూసేశారాయన. 2018లో తరతరాలుగా వస్తున్న కేశినేని ట్రావెల్స్ ను పూర్తిగా క్లోజ్ చేసేశారు. పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. అయితే ఇటీవలికాలంలో తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని ఇమడలేని పరిస్థితి ఏర్పడింది.
కేశినేని నాని 2019లో గెలిచిన తర్వాత కృష్ణా జిల్లా టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా పార్టీలో అంతర్గత పోరు ఏర్పడింది. ఎమ్మెల్సే బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు.. కేశినేనికి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారు. అధినేత చంద్రబాబు కూడా వాళ్ల మాటే వింటున్నారని కేశినేని భావించారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా తనతో పాటు తన కుమార్తెకు కూడా సీటు కావాలని కేశినేని పట్టుబడుతున్నారు. ఇందుకు జిల్లా నేతలతో పాటు చంద్రబాబు కూడా సుముఖంగా లేరని సమాచారం. ఇదే సమయంలో కేశినేని సోదరుడు కేశినేని చిన్నిని జిల్లా నేతలు తెరపైకి తెచ్చారు. నానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు.
కేశినేని నాని ఇటీవల జిల్లాలో నారా లోకేశ్ పర్యటనలో కూడా పాల్గొనలేదు. నాని వ్యతిరేకులే అంతా ముందుండి నడిపించారు. దీంతో నాని టీడీపీని వీడడం ఖాయమని తెలుస్తోంది. మైలవరం నుంచి తన కుమార్తె శ్వేతను ఎమ్మెల్యేగా, విజయవాడ పార్లమెంటు నుంచి తాను బరిలోకి దిగాలని కేశినేని నాని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాలను ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు నాని సిద్ధమయ్యారు. విజయవాడ పార్లమెంటును నానికి ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. కానీ మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదును కాదని ఇచ్చే పరిస్థితి లేదు. అయితే కేశినేని నాని మాత్రం ఇటీవల వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. వైసీపీ కూడా కేశినేనిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే సీట్ల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎన్నికల నాటికి తన డిమాండ్లు ఎవరు నెరవేరుస్తారో ఆ పార్టీలో చేరేందుకు నాని సిద్ధమైనట్టు సమాచారం. మరి నాని డిమాండ్లను వైసీపీ తీరుస్తుందా.. లేకుంటే టీడీపీయే ఆఫర్ చేస్తుందా.. అనేది చూడాలి.













