ఏపీలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. కేసీఆర్ సూపర్ స్ట్రాటజీ!
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనేది పాతది. ఇప్పుడు కొత్త నినాదం రాబోతోంది. విశాఖ ఉక్కు – తెలుగోడి హక్కు అని నినదించబోతున్నారు కేసీఆర్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కార్మికులు ప్రైవేటీకరించొద్దని మొత్తుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్తోంది. దీంతో కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రావట్లేదు. ఏపీలోని పార్టీలు కేంద్రంపై పోరాటానికి సాహసం చేయట్లేదు. సరిగ్గా ఇదే అంశాన్ని ఎత్తుకోవడం ద్వారా ఏపీలో పాగా వేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సాహసించట్లేదు. జనసేనాని పవన్ కల్యాణ్ ను బీజేపీ పద్దగా దేకట్లేదు. దీంతో అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రోదన కేంద్రానికి వినిపించట్లేదు. అయితే బీజేపీని ఎలాగైనా గద్దె దించాలనుకుంటున్న కేసీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ కోసం కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేశారు. ఏపీలోని పార్టీలు పట్టించుకోకపోయినా కేటీఆర్ ఈ అంశంపై స్పందించడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని నినాదంలో ఈ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలవాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించుకుంటూ పోతోందని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం ద్వారా తమ ఉద్దేశాన్ని అటు ఏపీ ప్రజలకు, ఇటు కేంద్రానికి తెలియజేయాలనుకుంటున్నారు. అవసరమైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున పాల్గొనాలనుకుంటున్నారు.
ఇదే జరిగేతే ఏపీలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలినట్లు అవుతాయి. ఏపీలో బీఆర్ఎస్ పాగా వేసేందుకు మంచి వేదిక దొరుకుతుంది. అలాగే కేంద్రంలోని బీజేపీని ఎండగట్టినట్లవుతుంది. రెండు ప్రయోజనాలు నెరవేరినట్లు అవుతాయి. రాష్ట్ర విభజనకు కారకుడిగా కేసీఆర్ పై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఏపీలోని పార్టీలేవీ పట్టించుకోని ఒక మేజర్ అంశాన్ని ఎత్తుకుని ఉద్యమించడం ద్వారా తనపై ఉన్న అపప్రదను పోగొట్టుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. అందుకే విశాఖ ఉక్కు – తెలుగోడి హక్కు నినాదంతో ఈ నెలలో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.













