Gudivada TDP: టీడీపీలో తులసి బాబు చిచ్చు..! గుడివాడ రాజకీయం ఇలాగే ఉంటుందా..!?
ఆంధ్రప్రదేశ్ లో గుడివాడకు (Gudivada) ప్రత్యేక స్థానముంది. ఎంతోమంది మహామహులు ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ (NTR) గుడివాడ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ఇక కొడాలి నాని (Kodali Nani) హవా గురించి తెలిసిందే. ఆయన ఇక్కడ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అయితే ఇక్కడ కొంతమంది నేతలు పార్టీలతో సంబంధం లేకుండా పెత్తనం చెలాయిస్తుంటారు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ల హవా కొనసాగుతుంటుంది. అలాంటి వాళ్లలో కామేపల్లి తులసి బాబు (Kamepalli Tulasi Babu) ఒకరు. ఇంతకీ ఈయనెవరు? టీడీపీలో ఈయన ఎలా చిచ్చు పెడుతున్నారు..?
కామేపల్లి తులసిబాబు పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. చెప్పుకోదగ్గ నేత కూడా కాదు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో (Custodial Torture Case) ఈయన పేరు బయటికి వచ్చింది. 2021 మేలో తనను అరెస్టు చేసినప్పుడు కొంతమంది బయటివ్యక్తులు వచ్చి తనను టార్చర్ చేశారని రఘురామ కృష్ణరాజు (RRR) ఫిర్యాదు చేశారు. వాళ్లలో కామేపల్లి తులసిబాబు కూడా ఉన్నారని ఆయన కంప్లెయింట్ లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ పై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసుకు (Prakasam District SP) రావాలని పోలీసులు ఆదేశించారు.
బుధవారం ఒంగోలుకు (Ongole) వెళ్లారు కామేపల్లి తులసిబాబు. విజయవాడ (Vijayawada) నుంచి భారీ ర్యాలీగా ఆయన వెళ్లిన ఆయన అడుగడుగా హడావుడి చేశారు. వాహనాలపై చంద్రబాబు, లోకేశ్, వెనిగండ్ల రాము (Gudivada MLA Venigandla Ramu) స్టిక్కర్లు, టీడీపీ జెండాలు పెట్టారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు. అంతేకాదు.. ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులనే బెదిరించారు. గుడివాడ వస్తే మీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు. నిమిషాల్లో ట్రాన్స్ ఫర్ చేయిస్తా.. మీ పేరు గుర్తు పెట్టుకుంటా.. వీఆర్ కు పంపిస్తా.. అని తులసిబాబు కూడా బెదిరించారు. అసలు తులసీబాబుకు ఎందుకింత ధైర్యం వచ్చిందని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
తులసీబాబు నిన్నమొన్నటి వరకూ వైసీపీలో హల్చల్ చేశారు. కొడాలి నాని ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. అంతేకాక అప్పటి రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక పాత్ర పోషించిన విజయ్ పాల్, సునీల్ లాంటి పోలీస్ అధికారులకు కూడా సన్నిహితుడిగా పేరొందారు. అందుకే ఆయన రఘురామకృష్ణంరాజు గుండెలపైకి ఎక్కి పిడిగుద్దులు కురిపించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు తులసీ బాబు టీడీపీలో ఫుల్లు హడావుడి చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎమ్మెల్యే కూడా తులసీబాబు వెంట లేకుండా బయటకు కదలట్లేదనే ఆరోపణలున్నాయి.
ఒకవైపు సొంత పార్టీ నేత, డిప్యూటీ సీఎం రఘురామ కృష్ణరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీబాబు.. పార్టీని అడ్డుపెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ఆయనకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. వైసీపీలో నిన్నటిదాకా చక్రం తిప్పిన తులసీబాబు ఇప్పుడిలా పార్టీలో కీలక నేతగా ఎలా ఎదిగారని ఆరా తీస్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనేది అంతుచిక్కడం లేదు. పార్టీలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని కేడర్ గుసగుసలాడుకుంటోంది.













