వైసీపీలో చేరనున్న జేడీ లక్ష్మినారాయణ..? విశాఖ నుంచే పోటీ..!?
మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మినారాయణ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఒంటరిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో విశాఖలో పలు కార్యక్రమాలు చేపడుతూ వాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఆయన ఏదో ఒక ప్రధాన పార్టీలో చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అది ఏ పార్టీ అనేది తెలియట్లేదు.
జేడీ లక్ష్మినారాయణకు మంచి పేరుంది. సీబీఐలో సమర్థుడైన అధికారిగా ముద్ర వేసుకున్నారు. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి కేసులను చేపట్టడం ద్వారా లక్ష్మినారాయణ పేరు మార్మోగింది. అయితే ఆయన ఐపీఎస్ గా ఉండడం కంటే రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఐపీఎస్ కు రాజీనామా చేశారు. ఒంటరిగానే ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటించి చివరకు జనసేనలో చేరారు. విశాఖపట్నం నుంచి 2019లో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. అయితే అదృష్టం కలిసి రాలేదు. ఆ తర్వాత జనసేన నుంచి ఆయన దూరమయ్యారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ ఆయన లేరు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. విశాఖ నుంచే ఈసారి కూడా పోటీ చేస్తానని జేడీ లక్ష్మినారాయణ ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది తెలియట్లేదు. అయినా ఆయన మాత్రం విశాఖలో నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్, భూముల ఉక్రమాలు, అవినీతి.. లాంటి వాటిపై ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోయానేమో కాని ప్రజల మనసుల్లో మాత్రం తాను గెలిచానని లక్ష్మినారాయణ చెప్తుంటారు. అందుకే ఈసారి కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పేశారు. పార్టీ డిసైడ్ కాకపోతే ఒంటరిగా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
లక్ష్మినారాయణ గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి వెళ్తారని చెప్పలేం. ఇక టీడీపీ తరపున విశాఖ నుంచి పోటీ చేసేందుకు ఖాళీ లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో నేతలు ఎక్కువయ్యారు. అయితే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో తనకు వైసీపీ, బీజేపీ నుంచి ఆహ్వానం ఉందన్నారు జేడీ లక్ష్మినారాయణ. దీంతో ఈ రెండు పార్టీల్లో ఒక దాని నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ పైన వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన స్థానంలో జేడీ లక్ష్మినారాయణను బరిలోకి దింపితే ఎలా ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నా ఆ పార్టీకి కేడర్ లేకపోవడంతో జేడీ లక్ష్మినారాయణ ఆ పార్టీలో చేరకపోవచ్చు.













