JC Brothers : బీజేపీపై జేసీ యుద్ధం ప్రకటిస్తున్నారా..?
జేసీ బ్రదర్స్ (JC Brothers) అంటే తెలియని వాళ్లుందరు. జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy), జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఇద్దరూ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. వయసు మీద పడడంతో జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఏదో ఒక సంచలనం ఉంటుంది. ఇప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తమ మిత్రపక్షమైన బీజేపీపై (BJP) నోరు పారేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrations) అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారన్నారు. అలాగే.. తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక చరిత్ర ఉంది. తనదైన మార్క్ తో ఆయన రాజకీయం నడిపిస్తుంటారు. ఆయన మాటే చెల్లుబాటు కావాలనుకునే నేత. తాడిపత్రిని (Tadipatri) ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆశయం. అందుకోసం ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వాటిపై విమర్శలు వచ్చినా ఆయన ఏమాత్రం చలించరు. వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతుంటారు. తాజాగా తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ వేడుకలకు మహిళలకు మాత్రమే ప్రవేశం అని చెప్పారు. జేసీ పార్క్ (JC Park) లో తన సొంత ఖర్చులతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
న్యూ ఇయర్ వేడుకలకు మహిళలకు మాత్రమే ప్రవేశం అని చెప్పగానే బీజేపీ నేత యామినీ శర్మ (Yamini Sharma), నటి మాధవీలత (Madhavi Latha) తప్పుబట్టారు. జేసీ పార్క్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అని.. అక్కడికి వెళ్లొద్దని మహిళలను హెచ్చరించారు. పెన్నా నది ఒడ్డునే ఉన్న ఆ ప్రాంతంలో నిత్యం గంజాయి సేవిస్తుంటారని.. ఆ మత్తులో మగాళ్లు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకైనా పాల్పడొచ్చని చెప్పారు. కాబట్టి ఎవరూ వెళ్లొద్దని సలహా ఇచ్చారు. అయినా ఆ వేడుకలకు మహిళలు వెళ్లారు. ఆ ఈవెంట్ ముగిసిపోయింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతల మాటలపై ధ్వజమెత్తారు.
మహిళలను వెళ్లొద్దనడానికి యామినీ శర్మ, మాధవిలత ఎవరని ప్రశ్నించారు. మాధవీలత ఓ ప్రాస్టిట్యూట్ అని అభివర్ణించారు. తనపై బీజేపీ, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ లేనిపోని ఆరోపణలు చేశాయన్నారు. తన బస్సులు ప్రమాదంలో కాలిపోలేదని.. దీని వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట ఫ్లైయాష్ వివాదంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి (Adinarayana Reddy) మధ్య పెద్ద దుమారమే రేగింది. ఇప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీతో మరోసారి గ్యాప్ వచ్చింది. మొత్తంగా చూస్తే బీజేపీకి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఏదో జరుగుతోందని మాత్రం అర్థమవుతోంది.













