జగన్ కు త్వరలో మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. ఉండవల్లి శ్రీదేవి శపథం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్ని లేపాయి. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష టీడీపీకి ఓటేశారు. దీన్ని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని విపేదించి ఇంతకుముందే బయటకు వచ్చారు. కొత్తగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టిడిపికి ఓటేసినట్లు గుర్తించి వైసిపి అధిష్టానం సస్పెండ్ చేసింది.
నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి మినహా మిగిలిన వాళ్లంతా స్పందించారు. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం మాట్లాడలేదు. కానీ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ ఉండవల్లి శ్రీదేవి ఏకంగా హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో వైసిపి అధిష్టానం పై శ్రీదేవి విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడు జగన్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇన్నాళ్లు తాను పార్టీలో నరకం అనుభవించినట్టు చెప్పారు.
నేను అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయానని విమర్శిస్తున్నారని నేను ఏమైనా మాఫియా డాన్నా అజ్ఞాతంలోకి వెళ్లడానికి అని ప్రశ్నించారు. గతంలో డా.సుధాకర్, డా.అచ్చెన్న ఎలా చనిపోయారనేది అందరికీ తెలుసన్నారు. రేపు డా.శ్రీదేవి అలా చనిపోకూడదనే ఉద్దేశంతోనే వెళ్లిపోవడం జరిగిందని చెప్పారు. నా కార్యాలయంపై గూండాలు ఇష్టారీతిన దాడులు చేశారు.. నేను చేసిన తప్పేంటో చెప్పకుండా నన్ను వేధింపులకు గురిచేశారని విమర్శించారు.
జగనన్న ఇళ్ల పథకం అనేది పెద్ద కుంభకోణం అని ఈ పథకంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఎస్సీలను అణగదొక్కేందుకు దాడులు చేస్తున్నారు.. చంపుతున్నారు అని విమర్శించారు. సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరిగితే నిబంధనల ఉల్లంఘన పేరుతో నన్ను సస్పెండ్ చేశారని ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతంలో నేను తప్ప ఎవరరైనా గెలిచేవారా? అని ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. వైసీపీ గూండాలు తనను రకరకాలుగా నన్ను వేధిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా రాస్తున్నారని.. శ్రీదేవి ఎక్కడని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. మండిపడ్డారు. దోచుకో పంచుకో తినుకో అని జగన్ చెబుతున్నారని.. మరి ఉద్దండరాయుని పాలెంలో ప్రజా సంపదను ఎవరు దోచుకుంటున్నారో జగన్ చెప్పాలని శ్రీదేవి ప్రశ్నించారు.
నేను ఎవరికి ఓటు వేశానో తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికకు ముందు నా కుమార్తెతో కలిసి జగన్ ను కలిశానని.. రాజధానిలో శ్రీదేవిని తప్పించాలని వాళ్ళు పక్కా ప్లాన్ వేశారని ఆమె ఆరోపించారు. నేను రూ.15 కోట్లు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేశారని శ్రీదేవి చెప్పారు. ఓ ఎమ్మెల్సీ జీతం ఎంత ఉంటుంది? ఎమ్మెల్సీకి ఓటువేస్తే ఎవరైనా రూ.15కోట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. నాపై పిచ్చి కుక్క అని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతిలోనే ఉంటుందని నాకు చెప్పారని.. అమరావతి రైతులకు ఏం చేయలేక పోతున్నానని మదనపడేదాన్ని అని శ్రీదేవి చెప్పారు. అమరావతికి జగన్ ఏం చేశారని ఆమె నిలదీశారు. కనీసం ఒక ఇటుకైనా అమరావతిలో పేర్చారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లు నేను బానిస సంకెళ్లలో ఉన్నానని.. ఇప్పుడు అమరావతి ప్రజలకు నేను మాటిస్తున్నా అని.. నా ప్రాణం పోయినా అమరావతి కోసం నిలబడతా అని శ్రీదేవి హామీ ఇచ్చారు.
సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉందని ఉండవల్లి శ్రీదేవి అనుమానం వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసే ఏపీలో అడగుపెడతానని.. తనకు పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత మహిళా ఎమ్మెల్యే ఏమీ చేయలేదని అనుకోవద్దని.. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయిందని.. త్వరలోనే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శ్రీదేవి చెప్పారు.
నేను డబ్బు తీసుకున్నానని నిరూపిస్తారా? అని శ్రీదేవి సవాల్ విసిరారు. ప్రమాణం చేద్దాం.. కాణిపాకం వస్తారా? అమరావతి వస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ దందాలు, మైనింగ్ లకు బినామీగా ఉండలేనని అందుకే నన్ను పార్టీ నుంచి తప్పించారని శ్రీదేవి చెప్పారు.













