జగన్నాథ రథచక్రాల్..! జగన్పై సినిమాకు రామ్ గోపాల్ వర్మ రెడీ..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. సుమారు 3 గంటలసేపు వారి మధ్య చర్చలు సాగినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ పై సినిమా తీసేందుకు రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకే ఆర్టీవీ ఇవాళ సీఎం జగన్ ను కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాయలసీమకు చెందిన ఓ ఎంపీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఆయనే ఇవాళ ఆర్జీవీని జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
సంచలన దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి శ్రీకారం చుడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పై సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. జగన్నాథ రథచక్రాలు అని ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేశారు. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడాదలయ్యేలా ఈ సినిమా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. వై.ఎస్.జగన్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నుంచి సీఎంగా జగన్ పరిపాలన వరకూ ఈ సినిమా ఉండేలా ఆర్జీవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జగన్ సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలతో పాటు ప్రతిపక్షాల వైఖరిని కూడా టార్గెట్ చేసేలా ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ఆర్జీవీ సన్నిహితులు చెప్తున్నారు..
గత ఎన్నికలకు ముందు కూడా ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఒక సినిమా తీశారు. అప్పడు ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గా ఆ సినిమా రూపొందింది. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే యాంగిల్లో ఆ సినిమాను ప్రొజెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తో పడినా … ఈ సినిమాపై చర్చ మాత్రం బాగానే జరిగింది. వైసీపీకి ఎంతో హెల్ప్ అయింది. ఇప్పుడు కూడా అదే విధంగా వైసీపీకి మేలు చేసేలా జగన్ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎంపీనే ఈ సినిమాకు నిర్మాత కావడంతో కచ్చితంగా ఇది ప్రతిపక్ష టీడీపీ, వైసీపీ టార్గెట్ గా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
అయితే రామ్ గోపాల్ వర్మ ఇటీవలికాలంలో తీసిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు. ఒకప్పుడు గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ గా పేరొందిన వర్మ.. ఇప్పుడు చీప్ సినిమాలు తీస్తున్నారనే ఆవేదన ఆయన అభిమానుల్లో ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన క్రియేటివిటీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సినిమా ఎలా ఉన్నా.. ఆ సినిమా చర్చ జరిగేలా చేయడంలో వర్మ నిష్ణాతులు. ఇప్పుడు కూడా జగన్ పై తీసే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయినా కాకపోయినా ఆ సినిమాపైన మాత్రం సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా జరుగుతుంది. కచ్చితంగా అది వైసీపీకి మేలు చేసేలా ఉంటుంది. వైసీపీకి కావాల్సింది కూడా ఇదే. ఎన్నికల నాటికి రిలీజయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.













