ఎన్నికల ముందు సినిమాలను నమ్ముకుంటున్న జగన్..!?
ఎన్నికల సమయంలో వాళ్లకు అనుకూలంగా సినిమాలు తీయించుకుని రిలీజ్ చేసుకోవడం పొలిటికల్ పార్టీలకు, నేతలకు అలవాటే. గతంలో ఎంతోమంది దర్శకులు తమకు నచ్చిన వాళ్లకు అనుకూలంగా, నచ్చని వాళ్లకు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు. అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా దాసరి నారాయణ రావు సినిమాలు తీశారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందు కొంతమంది సినిమాలు తీస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలాగే టీడీపీకి అనుకూలంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజయ్యాయి. ఎన్నికలకు ముందు కచ్చితంగా సినిమాల ఇంపాక్ట్ ఉంటుందని నేతలు నమ్ముతుంటారు. అందుకే ఇప్పుడు కూడా కొంతమంది సినిమాలపై ఆధారపడబోతున్నారు.
గత ఎన్నికలకు ముందు యాత్ర సినిమా వైసీపీకి పెద్ద ప్లస్ అయింది. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది. రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని హీరో మమ్ముట్టి కళ్లకు కట్టారు. వై.ఎస్.ఆర్. హావభావాలను రక్తి కట్టించారు. మమ్ముట్టిని చూసిన వాళ్లంతా రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు. దీన్ని మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు. ఈ సినిమా జగన్ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడిందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే ఇప్పుడు కూడా యాత్రకు సీక్వెల్ తీయించేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ నిర్మాతలు.
యాత్ర 2 పేరుతో సీక్వెల్ నిర్మించేందుకు సినిమా యూనిట్ సిద్ధమైందని తెలుస్తోంది. యాత్రలో వై.ఎస్.ఆర్. నేపథ్యాన్ని తెరకెక్కిచారు. ఇప్పుడు యాత్ర 2లో జగన్ పార్టీ ఆవిర్భావం, పాదయాత్ర, అధికారంలోకి రావడం, సంక్షేమ పథకాలు.. లాంటి అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ సినిమాలో హీరోగా తమిళనటుడు జీవాను ఎంపిక చేశారు. జీవా ఇప్పటికే విజయవాడ వచ్చి సీఎం జగన్ ను కలిసినట్టు సమాచారం. మహి.వి.రాఘవ్ త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్ దశలో ఉంది. ఎన్నికలకు ముందు సంక్రాంతి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అలాగే వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పటికే రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. వ్యూహం పేరుతో ఈ సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించి చాలాకాలమే అయింది. యాత్ర 2 పూర్తిగా జగన్ నేపథ్యంలోనే సాగుతుంది. కానీ ఆర్జీవీ వ్యూహం మాత్రం జగన్ పై ప్రత్యర్థులు పన్నిన కుట్రలను ఎత్తి చూపేలా తీయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఒకవైపు పాజిటివ్ దృక్పథాన్ని కలిగించడంతో పాటు.. మరోవైపు ప్రత్యర్థుల అవకాశవాద రాజకీయాలను ఎత్తిచూపేలా ప్లాన్ వేశారు. మొత్తానికి ఎన్నికలకు ముందు జగన్ మహి.వి.రాఘవ్, ఆర్జీవీలపై ఆధారపడబోతున్నారు. మరి జగన్ ను వీళ్లిద్దరూ ఎంతమేర గట్టెక్కిస్తారో చూడాలి.













