విశాఖే రాజధాని.. త్వరలోనే అక్కడికి మకాం.. జగన్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశం ఇప్పటికీ బ్రహ్మపదార్థమే. ఏపీ రాజధాని అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ప్రస్తుతే రాజధాని ఏదనేది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు సీఎం జగన్ రాజధానిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ రాజధాని కోబోతోందని ప్రకటించారు. అంతేకాదు.. త్వరలోనే తాను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో ఏపీ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో భాగంగా జరిగిన దౌత్యవేత్తల సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజధానిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని అర్థమవుతోంది.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించింది గత చంద్రబాబు ప్రభుత్వం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అమరావితికి జైకొట్టింది. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై యూటర్న్ తీసుకుంది. అమరావతి అభివృద్ధి తలకు మించిన భారమని.. ఇప్పుడు ఇక్కడ రాజధాని కట్టాలంటే లక్షకోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పింది. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అంతేకాదు.. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టింది. అయితే అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమించడం, ఈ అంశంపై కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘ విచారణ అనంతరం అమరావతే రాజధాని అని హైకోర్టు వెల్లడించింది. అదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం కూడా హైకోర్టుకు తెలిపింది.
ఇంతటితో మూడు రాజధానులకు బ్రేక పడిందని అందరూ భావించారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ నెలకొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడిది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఒకవైపు భూములిచ్చిన రైతులు, మరోవైపు రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం కావడంతో ఎలాంటి తీర్పు వస్తుందోననే ఆసక్తి ఏర్పడింది. కోర్టు పరిధిలో ఉన్న ప్రస్తుత సమయంలో సీఎం జగన్ రాజధానిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఏపీ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో భాగంగా ఢిల్లీలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా దౌత్యవేత్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “త్వరలోనే రాజధాని కాబోతున్న విశాఖకు మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. రాబోయే నెలల్లో నేను కూడా అక్కడికి షిప్ట్ కాబోతున్నాను” అని ప్రకటించారు. దీంతో రాజధానిపై క్లారిటీ వచ్చినట్లయింది. ప్రభుత్వం త్వరలోనే విశాఖను రాజధానిగా ప్రకటించబోతున్నట్టు అర్థమవుతోంది. కోర్టు అడ్డంకులు తొలగిన వెంటనే రాజధానిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే తమది మూడు రాజధానుల విధానమని వైసీపీ చెప్తూ వస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి, జ్యుడిషియరీ క్యాపిటల్ గా కర్నూలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇవన్నీ ఒట్టి మాటలేనని.. మూడు రాజధానులు కాకుండా విశాఖను మాత్రమే కేపిటల్ చేయబోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జగన్ కూడా మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా.. విశాఖ త్వరలోనే రాజధాని కాబోతోందని ప్రకటించారు. ఇది మూడు రాజధానుల్లో భాగమా.. లేకుంటే విశాఖ ఒక్కటే పూర్తిస్థాయి రాజధాని కాబోతోందా.. అనే ఉత్కంఠ ఇప్పుడు మళ్లీ మొదలైంది.













