IPS Officers: VRS బాటలో ఆరుగురు ఏపీ ఐపీఎస్ అధికారులు..?

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో (AP Police) పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు (IPS Officers) అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. డైరెక్టర్ జనరల్ (DG) స్థాయి అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్, రవిశంకర్ అయ్యన్నార్, ఆర్.కె.మీనా తదితరులు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దిశగా ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ అనుభవం, సామర్థ్యం, నిజాయితీకి తగిన గౌరవం లభించడం లేదని వీళ్లు భావిస్తున్నట్టు తలుస్తోంది. ముఖ్యంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒంటెద్దు పోకడలతో సీనియర్లకు గౌరవం లేకుండా పోయిందనే ఆవేదన వీళ్లలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత, పోలీసు విభాగంలో బదిలీలు, సస్పెన్షన్‌లు, పోస్టింగ్‌లలో జాప్యం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో డీజీ స్థాయి అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల సిద్ధార్థ్ కౌశల్ (2012 బ్యాచ్) స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. తాజాగా ఆయన రాజీనామాకు కేంద్ర హోంశాఖ ఆమోదం కూడా తెలిపింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని ఆయన ప్రకటించారు. అయితే మిగిలిన సీనియర్ల అసంతృప్తికి శాఖాపరమైన అంశాలే కారణమని తెలుస్తోంది.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) విజిలెన్స్ విభాగాన్ని తన ఆధీనంలోనే ఉంచుకోవడం అసంతృప్తికి కారణం. సహజంగా విజిలెన్స్ ను డీజీ స్థాయి సీనియర్ అధికారికి ఇస్తుంటారు. కానీ ఇక్కడ డీజీపీ తన వద్దే ఉంచుకున్నారు. రవిశంకర్ అయ్యన్నార్ (Ravi Shankar Ayyannar) సీఐడీ విభాగాధిపతిగా ఉన్నప్పటికీ, తన విభాగంలో నిర్ణయాలు బయటి నుంచి తీసుకుంటున్నారనే ఆవేదన ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ అధికారులకు తగిన పోస్టింగ్‌లను కేటాయించడంలో జాప్యం చేయడం కూడా అసంతృప్తికి మరో కారణం. కొందరు డీజీలు తమ అనుభవానికి తగిన బాధ్యతలు లభించడం లేదని భావిస్తున్నారు. డీజీ స్థాయి అనేది ఐపీఎస్ అధికారులకు మహోన్నతమైనది. అయితే, ఈ అధికారులు తమ సీనియారిటీకి తగిన కనీస గౌరవం, మర్యాద కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలసుబ్రహ్మణ్యం (Balasubramanyam IPS) నల్లమల అడవులలో నక్సలైట్ కార్యకలాపాలను అణచివేయడంలో కీలకపాత్ర పోషించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి (Madireddy Prathapa Reddy IPS) నీతివంతమైన అధికారిగా పేరుంది. రవిశంకర్ అయ్యన్నార్ సీఐడీ విభాగాధిపతిగా ఉన్నారు. అయితే తన విభాగంలో బయటివ్యక్తుల ప్రమేయం అధికమైందనే ఆవేదన ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్, ఆర్.కె.మీనా తదితరులు కూడా తమ అనుభవానికి తగిన బాధ్యతలు లభించడం లేదని భావిస్తున్నారు.
ఈ ఆరుగురు డీజీ స్థాయి అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ దిశగా ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గౌరవం లేని పదవులలో కొనసాగడం కంటే వీఆర్‌ఎస్ తీసుకోవడం తమ ప్రతిష్టకు తగినదని భావిస్తున్నారట. ఆరుగురు డీజీ స్థాయి అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే, రాష్ట్ర పోలీసు విభాగంలో నాయకత్వ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. బాలసుబ్రహ్మణ్యం వంటి అనుభవజ్ఞులైన అధికారులు తప్పుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. సీనియర్ అధికారుల ఆవేదనలను పరిష్కరించడం, తగిన పోస్టింగ్‌లను కేటాయించడం అవసరం.