ఐపీఎస్లకు చంద్రబాబు సర్కార్ భయపడుతోందా..?
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తయింది. ఈ కాలంలో అనేక పాలనాపరమైన సంస్కరణలు మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. గత ప్రభుత్వంలో జగన్ అండ్ కోకు నిబంధనలకు విరుద్ధంగా సేవ చేసిన వారికి విధులు కేటాయించకుండా వెయిటింగ్ లో పెట్టారు. దాదాపు 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లకు విధులు కేటాయించకపోవడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. అయితే ఇలాంటి ఐపీఎస్ లకు పోస్టింగ్స్ ఇవ్వకపోవడమే మంచిదని కొందరు వాదిస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అలాంటి అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరెవరు ఎక్కడెక్కడ చట్టాన్ని ఉల్లంఘించి పని చేస్తున్నారో.. వాళ్లంతా తాము అధికారంలోకి వచ్చాక శిక్ష ఎదుర్కోక తప్పదని చంద్రబాబు చెప్తూ వచ్చారు. లోకేశ్ అయితే ఏకంగా రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటూ వచ్చారు. బహిరంగంగానే తండ్రీ కొడుకులు అలాంటి అడ్డగోలు అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొదట అలాంటి అడ్డగోలు అధికారులను లిస్టవుట్ చేసి విధుల నుంచి తప్పించింది. వాళ్లకు పోస్టింగ్స్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసింది. దాదాపు 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్, కాంతి రాణా తాతా, అమ్మిరెడ్డి, రఘురామిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజు, జుషువా, అన్బురాజన్, కృష్ణపటేల్ తదితరులు వెయిటింగ్ లో ఉన్నారు. దీంతో వీళ్లు తమ పనులు తాము చేసుకుంటున్నారు. తాజాగా వీళ్లను డీజీపీ కార్యాలయంలో ప్రతిరోజూ హాజరు కావాలని డీజీపీ ఆదేశించారు. ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది.
వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్లంతా సీనియర్ ఐపీఎస్ లు. ఇలాంటి వాళ్లకు పోస్టింగ్స్ ఇవ్వకుండా నాన్చుతుండడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరత ఉంది. అయినా వీళ్లను వినియోగించుకోకపోవడం సరికాదనేది వాళ్ల వాదన. అయితే ఇలాంటి అధికారులకు ప్రధాన బాధ్యతలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏదైనా లూప్ లైన్ పోస్టులు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అంతేకాక గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పని చేసినందుకు వీళ్లలో కొందరు విచారణ ఎదుర్కోనున్నారు. ఐపీఎస్ లకు చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ విమర్శిస్తోంది. అయితే ఇప్పటికీ ఈ ఐపీఎస్ లు వైసీపీ సేవల్లో తరిస్తున్నారని.. అందుకే డీజీపీ ఆఫీసుకు ప్రతిరోజూ రావాలని చెప్పినట్లు టీడీపీ చెప్తోంది. మొత్తానికి ఏపీలో ఐపీఎస్ ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.













